తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Peddapalli : పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఇదేం పాడు పని?

Peddapalli : పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఇదేం పాడు పని?

25 November 2024, 16:13 IST

google News
    • Peddapalli : పవిత్రమైన అయ్యప్ప మాల ధరించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పాడు పని చేశాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఆయన్ను కోర్టు ముందు హాజరుపర్చారు. అటు ఏసీబీ దాడులు చేస్తున్నా తెలంగాణలో కొందరు అధికారులు మారడం లేదు.
ఓంకారం నర్సింగరావు
ఓంకారం నర్సింగరావు

ఓంకారం నర్సింగరావు

రూ.20 వేలు లంచం తీసుకుంటూ.. పెద్దపల్లి జిల్లా నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఓంకారం నర్సింగరావు ఏసీబీకి చిక్కారు. సంచం డబ్బులు తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఎదురుగా ఉన్న సాయిశ్రీ జిరాక్స్ సెంటర్ సమీపంలో.. ఉదయం 10:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

కాంట్రాక్టర్ నీటి పారుదల విభాగంలో నిర్మాణ పనులు చేశారు. దానికి సంబంధించిన కొలతలు రికార్డ్ చేయడానికి, ఫైల్ మూవ్ చేయడానికి ఏఈ నర్సింగరావు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్‌కు డబ్బు ఇచ్చి.. ఏఈకి ఇవ్వమని చెప్పారు. ఇస్తుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

నర్సింగరావు నిజాయితీ లేకుండా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఆయన లంచం డిమాండ్ చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి.. కరీంనగర్‌లోని ఏపీబీ కోర్టులో హాజరుపర్చారు. దీనిపై విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

ఏసీబీ దూకుడు..

తెలంగాణలో 21వ తేదీ వరకు ఏసీబీ అధికారులు 12 చోట్ల దాడులు నిర్వహించారు. అవినీతి అధికారులను పట్టుకున్నారు. 21.11.2024న సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు పంచాయతీ కార్యదర్శి పి.సచిన్ కుమార్‌ను ఏసీబీ పట్టుకుంది. ఇంటి నంబర్ కోసం లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

21.11.2024న మహబూబాబాద్ జిల్లా సర్వే, భూ దస్తవేజుల కార్యాలయంలో పనిచేసే సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ కళంగి జ్యోతి క్షేమ బాయిని ఏసీబీ పట్టుకుంది. భూమికి సంబంధించి టిప్పన్ రికార్డును ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసింది. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది.

20.11.2024న హైదరాబాద్‌లోని మలక్‌పేటలో స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌లు (మహబూబ్ బాషా, సోమశేఖర్)ను ఏసీబీ పట్టుకుంది. బ్యాంక్ అకౌంట్‌ను అన్‌ఫ్రీజ్ చేయడానికి లెటర్ ఇచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ పట్టుకుంది.

20.11.2024న హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో జీహెచ్ఎంసీ శానిటరీ ఉద్యోగులు ఎండీ సలీం ఖాన్, జి.గణేష్‌ను ఏసీబీ పట్టుకుంది. కాఫీ దుకాణంపై పన్ను విధించకుండా ఉండేందుకు వీరు రూ.60 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ.25 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

19.11.2024న పెద్దపల్లి జిల్లా అంతరగాం మండల తహసీల్దార్ వి.రమేష్ ఏసీబీకి చిక్కారు. పోలీసులు పట్టుకున్న ట్రాక్టర్‌ను విడుదల చేయడానికి లంచం డిమాండ్ చేశారు. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ద్వారా రూ.12 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసి డబ్బులు బయటకు విసిరేసి పారిపోయాడు. అతన్ని పట్టుకున్నారు. గతంలో కూడా రమేష్‌ను ఏసీబీ పట్టుకుంది.

18.11.2024న గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్ పాండురంగారావును ఏసీబీ పట్టుకుంది. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

14.11.2024న కామారెడ్డి జిల్లా లోని లింగంపేటలో ఎస్సై పి.అరుణ్, స్టేషన్ రైటర్ రామస్వామిని ఏసీబీ పట్టుకుంది. రూ.10 వేలు లంచం తీసుకుంటూ వీరు ఏసీబీకి చిక్కారు.

13.11.2024న నిర్మల్ పురపాలక కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎంఏ షకీర్ ఖాన్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

08.11.2024న నిజామాబాద్ జిల్లా వర్ణి ఎస్సై బి. కృష్ణ కుమార్ ఏసీబీకి చిక్కాడు. బాధితుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది.

07.11.2024న మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాధికారి ఆటి రవీందర్‌ను ఏసీబీ పట్టుకుంది. పదోన్నతికి సంబంధించి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

05.11.2024న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లయ్యను ఏసీబీ పట్టుకుంది. విద్యుత్తు మీటర్ కోసం ఎన్వోసీ ఇవ్వడానికి పుల్లయ్య లంచం డిమాండ్ చేశారు.

02.11.2024న ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల తహశీల్దార్, జండాగూడెం, పోచంలొద్ది గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.శేఖర్‌లను ఏసీబీ పట్టుకుంది. సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన చెక్కును ఇవ్వడానికి రూ.12 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

తదుపరి వ్యాసం