Polavaram Funds: పోలవరం నిధుల విడుదలకు సానుకూలమే కానీ కాంట్రాక్టర్‌పై క్లారిటీ కోరిన కేంద్రం-the center is positive for the release of polavaram funds but has sought clarity on the contractor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Funds: పోలవరం నిధుల విడుదలకు సానుకూలమే కానీ కాంట్రాక్టర్‌పై క్లారిటీ కోరిన కేంద్రం

Polavaram Funds: పోలవరం నిధుల విడుదలకు సానుకూలమే కానీ కాంట్రాక్టర్‌పై క్లారిటీ కోరిన కేంద్రం

Sarath chandra.B HT Telugu
Jul 23, 2024 07:38 AM IST

Polavaram Funds: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి నిధుల్ని విడుదల చేయడానికి సుముఖత చూపిన కేంద్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్‌పై క్లారిటీ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.

పోలవరం పూర్తి చేయడంపైనే బీజేపీ ఫోకస్
పోలవరం పూర్తి చేయడంపైనే బీజేపీ ఫోకస్

Polavaram Funds: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరగడంతో కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. విభజన హామీల అమలు విషయంలో తరచూ విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుండటంతో బీజేపీ పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది.

yearly horoscope entry point

2014-24 మధ్య కాలంలో జరిగిన రకరకాల పరిణామాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సహకరించేందుకు కేంద్రం సుముఖత తెలిపింది. సోమవారం ఏపీ ప్రతినిధి బృందంతో చర్చల తర్వాత నిధుల విడుదలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సుముఖత వ్యక్తం చేశారు.

పనులు పూర్తి చేయడమే లక్ష్యం…

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం మిగిలిన ఉన్న పని ఎర్త్ కమ్‌ రాక్‌ ఫిల్ డ్యామ్‌ మాత్రమే. ఈసిఆర్‌ఎఫ్ డ్యామ్‌ నిర్మాణం చేపట్టడానికి సాంకేతికంగా అవరోధాలు ఎదురయ్యాయి.

2019-20 మధ్య కాలంలో వరదల్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. గోదావరి ఉపరితలం నుంచి భూమి లోపల రాతి పొరలు తగిలే వరకు తవ్వుకుంటూ నిర్మించిన డయా ఫ్రం వాల్ పలు చోట్ల వరద ఉధృతికి కొట్టుకుపోయింది. డయాఫ్రం వాల్‌కు రెండు వైపులా కాఫర్‌ డ్యామ్‌లను నిర్మించినా కొన్ని చోట్ల గ్యాప్‌లు ఉండటంతో డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతింది.

దీంతో ప్రాజెక్టులో కీలకమైన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు నిలిచిపోయాయి. 2019-22 వరకు వరుసగా వచ్చిన వరదలతో పాటు అంతకు ముందు 2016-19 మధ్య వచ్చిన వరదల్లో కూడా ఇది దెబ్బతిని ఉంటుందనే వాదనలు ఉన్నాయి.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నిర్మాణ పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించి రివర్స్‌ టెండరింగ్‌లో మేఘాకు పనులు అప్పగించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణ పనులపై ఏం జరుగుతుందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.

కాంట్రాక్టు సంస్థ విషయంలో వైసీపీ మాదిరే టీడీపీ వ్యవహరిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే స్పష్టత ఇచ్చారు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు.

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు పెండింగ్…

ప్రస్తుతం పోలవరంలో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణమే మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. అందులో డయాఫ్రం వాల్ నిర్మాణం జర్మనీ కి చెందిన బావర్ కంపెనీ నిర్మిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏ కంపెనీ వచ్చినా డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని ఆ కంపెనీ చేయాల్సి ఉంటుంది. 2015-16లో కూడా డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు బావర్ కంపెనీ చేపట్టింది. ఇప్పుడు కూడా వాళ్ళే చేయాల్సి ఉంటుంది. డయాఫ్రం వాల్ టెక్నాలజీ పేటెంట్‌ బావర్‌ కంపెనీ వద్ద మాత్రమే ఉంది. దీంతో బావర్ కంపెనీ తోనే మళ్లీ పనులు చేయించాల్సి ఉంటుంది. ఆ పనిని బావర్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిపూర్తి చేయించాల్సి ఉంటుంది. మిగతా రాక్ ఫిల్లింగ్ వర్క్ మాత్రం కాంట్రాక్టర్ చేయాల్సి ఉంటంది.

మరో వైపు డయాఫ్రం వాల్ కు సంబందించిన కొత్త డిజైన్లు రావాల్సి ఉంది. కొత్త గోడను కట్టాలా పాత దానికి రిపేర్లు చేయాలా అన్నది కూడా తేల్చాల్సి ఉంది. వాటిపై కేంద్రం స్పష్టత వచ్చాకే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణ పనుల్లో ఎలాంటి మౌలిక మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం విషయంలో న్యాయవివాదాలు, సాంకేతిక సమస్యలు, కాంట్రాక్టర్ల సమస్యలు వంటి కారణాలతో ప్రాజెక్టును జాప్యం చేయడానికి అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం విషయంలో గతంలో జరిగిన పొరపాట్లకు తావిచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. సోమవారం ఏపీ ప్రతినిధులకు ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి సూచించినట్టు సమాాచారం.

నిధుల విడుదలకు సానుకూలమే..

పోలవరం తొలిదశ పనుల కోసం రూ.12,157 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. నిధుల అంశాన్ని కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నారు. పోలవరం తొలిదశలో 41.15 మీటర్ల వరకు నీళ్లు నిల్వ చేసేందుకు వీలుగా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పనుల కోసం రూ.12,157 కోట్లను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానా యుడు, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివా సవర్మల నేతృత్వంలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీలు.. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ప్రాజెక్టు పరి స్థితిని వివరిస్తూ వినతిపత్రం ఇచ్చారు.దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు మంత్రి నిమ్మల తెలిపారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఎన్డీయే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, చంద్రబాబు సారథ్యంలో పోలవరం నిర్మాణ పనుల్ని పూర్తి చేయడానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి రామానాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ నిర్లక్ష్యం చేసిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

2024 జూన్ వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రూ. 21,898.28 కోట్లు ఖర్చు చేయగా అందులో రూ. 17,167.57 కోట్లను ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చిన తర్వాత ఖర్చు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ.15,146.27 కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించింది. మరో రూ. 2021.30 కోట్ల రావాల్సి ఉంది. వాటిని విడుదల చేయాలని కోరారు. తొలి దశ పూర్తి చేయడానికి రూ.12వేల కోట్లు కావాలని కోరగా కేంద్రం సానుకూలంగా ఉందని ఏపీ మంత్రులు చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం