Hyderabad Pollution : డేంజర్ బెల్స్.. కాలుష్యం కోరల్లో హైదరాబాద్.. ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువ!
02 December 2024, 8:25 IST
- Hyderabad Pollution : హైదరాబాద్‌లో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది పర్యావరణ సమస్యగా మారుతుంది. భాగ్యనగరం ప్రస్తుతం అత్యధిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 531వ స్థానంలో ఉంది. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల కంటే కాలుష్యం 1.18 రెట్లు ఎక్కువగా ఉంది.
హైదరాబాద్‌లో కాలుష్యం
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరుగుతోంది. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా విడుదల చేసింది. దీని ప్రకారం వివిధ ప్రాంతాల్లో మోడరేట్, పూర్ ఎయిర్ క్వాలిటీ ఉంది. నవంబర్ మెలలో గాలి నాణ్యత గణనీయమైన హెచ్చుతగ్గులు నమోదైనట్టు కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.
నగరంలోని సనత్‌నగర్ ప్రాంతంలో గాలి నాణ్యత బాగా క్షీణించిందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. నవంబర్ 30న పూర్ ఎయిర్ క్వాలిటీ నమోదైంది. మరోవైపు జూ పార్క్ ప్రాంతంలో నవంబర్ 28, 29, 30 తేదీల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో వరుసగా 167, 167, 163 నమోదైంది. ఈ గణాంకాలు మోడరేట్ కేటగిరీ కిందకు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
అటు బొల్లారం పారిశ్రామిక జోన్, ఇక్రిసాట్ పటాన్‌చెరు, న్యూ మలక్‌పేట్, సోమాజిగూడ, సెంట్రల్ యూనివర్శిటీ, రామచంద్రపురం, నాచారం, ఈసీఐఎల్, కాప్రా, కోకాపేట్, కొంపల్లి మున్సిపాలిటీ, ఐఐటిహెచ్ సహా అనేక ఇతర ప్రదేశాల్లో మోడరేట్ గణాంకాలే నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోల్చితే.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించిందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది.
ఎయిర్ క్వాలిటీ ఇలా..
0-50: బాగుంది
50-100: మితమైన కాలుష్యం
100-200: పూర్ ఎయిర్
200-300: అనారోగ్యకరమైనది
300-400: తీవ్రమైన కాలుష్యం
400-500+: ప్రమాదకరమైన కాలుష్యం
అందరి బాధ్యత..
భవిష్యత్తు తరాల మనుగడకు ఇబ్బంది లేకుండా పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని.. మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు, జాతీయ కాలుష్య నియంత్రణ రోజు సందర్భంగా.. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తు చేశారు. ఈ ఏడాది ‘స్వచ్ఛమైన గాలి, పచ్చని భూమి-సుస్థిరమైన జీవనం వైపు అడుగు’ అనే నేపథ్యంతో కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పిచేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆంధ్వర్యంలో కాలుష్య నియంత్రణ రోజును నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటుతూ, పర్యావరణ పరిరక్షణకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.