10, 12వ తరగతి విద్యార్థుల ఊపిరితిత్తులు వేరుగా ఉన్నాయా? దిల్లీ గాలి నాణ్యత పిటిషన్లపై విచారణ
Supreme Court On Delhi AQI : దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం విచారణ చేసింది.
దేశ రాజధాని దిల్లీ, దాని పరిసర ఎన్సీఆర్ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, క్షీణిస్తున్న గాలి నాణ్యతకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. 10, 12 తరగతులు మినహా మిగిలిన విద్యార్థులందరికీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలన్న దిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని పిటిషనర్ ప్రశ్నించారు. ఈ రెండు తరగతుల్లో చదివే విద్యార్థుల ఊపిరితిత్తులు మిగతా వారికంటే భిన్నంగా ఉన్నాయా అని ప్రశ్నించారు.
10, 12 తరగతుల విద్యార్థుల ఊపిరితిత్తులను ఇతర విద్యార్థుల నుంచి వేరు చేసేలా ఉండవని, వారి భౌతిక తరగతులను కూడా నిలిపివేయాలని ఆదేశించాలని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్.. జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనానికి విన్నవించారు.
న్యాయవాది శంకరనారాయణన్ అభ్యర్థనపై స్పందించిన ధర్మాసనం గాలి నాణ్యత క్షీణిస్తున్న దృష్ట్యా 12వ తరగతి వరకు అన్ని తరగతుల భౌతిక తరగతులను నిలిపివేయాలని దిల్లీ-ఎన్సీఆర్(నేషనల్ క్యాపిటల్ రీజియన్) ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను తక్షణమే ఆదేశించింది. జీఆర్ఏపీ ఫేజ్ 4 కింద విధించిన ఆంక్షల ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీఆర్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
కాలుష్య స్థాయిలను తగ్గించడానికి జీఆర్ఏపీ నాల్గో దశ కింద ఆంక్షలను అమలు చేయడానికి వెంటనే బృందాలను ఏర్పాటు చేయాలని ఎన్సీఆర్‌లోని అన్ని రాష్ట్రాలను కోర్టు ఆదేశించింది. ఏక్యూఐ స్థాయి 450 కంటే దిగువకు వెళ్లినా జీఆర్ఏపీ నాలుగో దశ కింద ఆంక్షలు కొనసాగించాలని కోర్టు పేర్కొంది.
దిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం, వచ్చే ఏడాది బోర్డు పరీక్షల దృష్ట్యా సోమవారం నుండి 10, 12 తరగతులు మినహా అన్ని తరగతుల విద్యార్థులకు భౌతిక తరగతులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. కాని అదే రోజు సాయంత్రానికి గాలి నాణ్యత మరింత క్షీణించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) ఫేజ్ 4 కింద ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం నుంచి జీఆర్ఏపీ 4 అమలుతో 10, 12 తరగతులు మినహా మిగిలిన విద్యార్థులందరికీ భౌతిక తరగతులు మూసివేస్తామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తాయని ముఖ్యమంత్రి అతిషి ఆదివారం తెలిపారు. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
మరోవైపు హర్యానా ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 5వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్సీఆర్ డిప్యూటీ కమిషనర్లు సెలవు పొడిగించాలని లేదా ఆన్‌లైన్ తరగతులకు మారాలని ఆదేశించారు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇంకా పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించలేదు. పంజాబ్‌లో కూడా అధిక కాలుష్యం నమోదైంది. అక్కడ కూడా పాఠశాలను మూసివేయాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.