Hyderabad: అవి కూడా కూల్చేస్తారా.. హైడ్రాపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
25 August 2024, 17:49 IST
- Hyderabad: హైడ్రా కూల్చివేతలపై పొలిటికల్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. గతంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పరోక్ష వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డైరెక్ట్ గానే ఎటాక్ చేశారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు. ఓవైసీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి.
అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో.. చాలామంది హైడ్రా చర్యలను సమర్థిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. అదే సమయంలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా హైడ్రా కూల్చివేతలపై పొలిటికల్ పంచ్‌లు పేలుతున్నాయి. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, సీపీఐ నారాయణ హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అసదుద్దీన్ ఒవైసీ వెర్షన్ ఇదీ..
'కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా.. నెక్లెస్‌రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది. నెక్లెస్ రోడ్‌ను కూడా తొలగిస్తారా.. జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేది. మరి జీహెచ్‌ఎంసీ కార్యాలయం పరిస్థితేంటి' అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.
సినిమా డైలాగ్‌లు కొట్టడం కాదు..
'ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను సమర్థిస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి బుస కొట్టింది. తర్వాత సైలెంట్ అయ్యింది. అక్రమ కట్టడాలను సీఎం రేవంత్ కూల్చేయించడం మంచిదే. నాగార్జున మంచి నటుడు కావొచ్చు.. కానీ కక్కుర్తి ఎందుకు.? సినిమా డైలాగ్‌లు కొట్టడం కాదు.. బుకాయింపు మాటలు వద్దు' అని నారాయణ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో హైడ్రా చర్యలను సమర్థిస్తూ వాక్ నిర్వహించారు. గండిపేట్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో సపోర్ట్ వాక్ చేశారు. చెరువులను కాపాడుకోవాలని పిలుపునిస్తూ వాక్ నిర్వహించారు. మరోవైపు హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించేవాళ్లను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
వారి భరతం పడతాం..
'చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తాం. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని.. ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నాం. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతాం. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. ఫాంహౌస్‌ల డ్రైనేజీ కాల్వను గండిపేటలో కలిపారు. మీ విలాసం కోసం వ్యర్థాలను చెరువులో కలుపుతారా.. అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా కబ్జాదారులను వదలం. ప్రకృతిసంపద విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది.. చెన్నై, వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపాన్ని చూశాం. భవిష్యత్ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలి' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.