Minister Narayana : రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులను రానున్న రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9.06 గంటల సమయంలో వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిని ప్రపంచంలోనే తొలి ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యుత్తమమైన డిజైన్ ను రూపొందించి అమలుపర్చామన్నారు. రాజధానిలో చేపట్టే ఎటు వంటి అభివృద్ధి కార్యక్రమమైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా సింగపూర్ ప్రభుత్వం సహాయంతో అత్యుత్తమమైన డిజైన్ ను రూపొందించి అమలు పర్చామన్నారు.
రాజధానిలో మెజారిటీ ప్రాంతం కవర్ అయ్యే విధంగా మౌలిక వసతుల కల్పనతో పాటు మంత్రులకు, కార్యదర్శులకు, అధికారులకు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణానికి తొలి దశలో పనులను చేపట్టేందుకు గతంలో రూ.48 వేల కోట్లతో టెండర్లను పిలిచి పనులను ప్రారంభించి, దాదాపు రూ. 9 వేల కోట్ల చెల్లింపులను కూడా చేశామన్నారు. మంత్రులకు, కార్యదర్శులకు, అధికారులకు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణం కూడా దాదాపు 90 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో భాగంగా 2015 జనవరి 1 న ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికల్లా ఎటువంటి లిటిగేషన్ లేకుండా 34 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అందజేశారన్నారు. అటువంటి రాజధాని అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి గతంలో ఎంతో స్టడీ చేసి మంచి అనుభవాన్ని సాధించానని, అదే దృష్టితో సీఎం చంద్రబాబు మళ్లీ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తనకు అప్పగించారన్నారు. నేటి నుంచి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ రానున్న 15 రోజుల్లో ఒక క్లారిటీకి వచ్చి, ఏ సమయంలోపు ఏది పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెపుతూ.. రాజధాని అభివృద్ధి విషయంలో గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్నే అమలు పరుస్తామన్నారు. అమరావతి అభివృద్ధి పనులను మూడు దశల్లో నిర్వహించేందుకు గతంలో ప్రణాళిక రూపొందించి అమలు పర్చామన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి తొలిదశలో రూ.48 వేల కోట్లు అవుతాయని అంచనా వేశామన్నారు. ఈ తొలి దశ పనులతో సిటీ నిర్మాణ పనులు పూర్తి అవుతాయని, రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపడతామన్నారు.
నిరుపేదలకు కేవలం రూ.5 లకే ఉదయం టిఫిన్, రూ.5 లకే మధ్యాహ్న భోజనం, రూ.5 లకే రాత్రికి భోజనం అందజేసే అన్న క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్ధరిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆదివారం అన్న క్యాంటీన్ల పునరుద్దరణపై మున్సిఫల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తొలిసారిగా చేసిన ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్ కూడా ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ 184 క్యాంటీన్లను ప్రారంభించగా మిగిలిన 19 క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉండిపోయాయన్నారు. పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్ల వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అయితే నిర్వీర్యం అయిపోయిన అన్న క్యాంటీన్ల పునరుద్దరించేందుకు అవసరమైన మరమ్మత్తులు చేసేందుకు అంచనాలను రెండు మూడు రోజుల్లో అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
గతంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించామని, మూడు పూట్లా ఆహారం అందజేసేందుకు రోజుకు రూ.73 ఛార్జ్ చేసేవారన్నారు. అయితే అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకి కేవలం రూ.15 లకే మూడు పూట్లా ఆహారం అందజేస్తూ మిగిలిన రూ.58 లను రాయితీగా ప్రభుత్వమే భరించేదన్నారు. రోజుకి 2.25 లక్షల మంది అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం చేసే వారని, తమ హయాంలో మొత్తం మీద 4 కోట్లు 60 లక్షల 31 వేల 600 ప్లేట్ల భోజనాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేశామన్నారు. తొలుత మున్సిపల్ ప్రాంతాల్లో ఈ అన్న క్యాంటీన్లు పెట్టామని, ప్రజల ఆదరణ ఎంతగానో ఉండటాన్ని గమనించి చాలా మంది శాసనసభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రిని కోరగా, గ్రామీణ ప్రాంతాలకు కూడా మరో 150 అన్న క్యాంటీన్లను ముంజూరు చేశారన్నారు. పెద్ద ఎత్తున ప్రజల ఆదరణను పొందిన అన్న క్యాంటీన్లను మళ్లీ పునరుద్దరించేందుకు సీఎం ఆమోదంతో త్వరలోనే చర్యలు చేపట్టనున్నామన్నారు.
సంబంధిత కథనం