CM Revanth Reddy : ఒత్తిడి వచ్చినా, మిత్రులవి ఉన్నా వదిలేదే లేదు… ఆక్రమించిన వారి భరతం పడతాం - సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy key comments on encroachment of ponds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ఒత్తిడి వచ్చినా, మిత్రులవి ఉన్నా వదిలేదే లేదు… ఆక్రమించిన వారి భరతం పడతాం - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ఒత్తిడి వచ్చినా, మిత్రులవి ఉన్నా వదిలేదే లేదు… ఆక్రమించిన వారి భరతం పడతాం - సీఎం రేవంత్ రెడ్డి

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 25, 2024 01:37 PM IST

చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. అక్రమ నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలేసేదే లేదన్నారు. ఒత్తిడి వచ్చినా, మిత్రులవి ఉన్నా భరతం పట్టి తీరుతామన్నారు. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫాంహౌస్లు ఉన్నా వదలమన్నారు. అక్రమణదారుల చర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తామని చెప్పారు. హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

వదిలేస్తే విఫలమైనట్లే…

చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్లు కట్టుకున్నారని… వారంతా డ్రైనేజీని చెరువుల్లో కలుపుతున్నారని అన్నారు. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష సాధించటం కోసమో కూల్చివేతలు చేయడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే తాను ప్రజా ప్రతినిధిగా విఫలమైనట్లే అని కామెంట్స్ చేశారు.

"హైదరాబాద్ లేక్ సిటీ. గండిపేట, ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్ లు కట్టుకున్నారు. ఆ ఫాంహౌస్ నాలాలు గండిపేటలో కలిపారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారున్నారని అన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చని.... సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండవచ్చని పేర్కొన్నారు. వారెవరిని పట్టించుకోననన్న ఆయన.... ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

హైడ్రా దూకుడు:

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 'హైడ్రా'..హడలెత్తిస్తోంది..! అక్రమ కట్టడాల విషయంలో ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, నాలాల కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రికార్డులు బయటికి తీస్తూ.... అసలు విషయాలను బట్టబయలు చేసే పనిలో పడింది. ప్రభుత్వం కల్పించిన విస్తృత అధికారాలతో అక్రమ నిర్మాణాలను బుల్డోజ్ చేసేస్తోంది.

సామాన్యులు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా 'హైడ్రా' కఠినంగా వ్యవహారిస్తోందనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. శనివారం టాలీవుడ్ హీరో అఖినేని నాగార్జునకు చెందిన ఎన్ - కన్వెన్షన్ ను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది. ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. తాజాగా హైడ్రాకు ఫిర్యాదు అందటంతో... నేరుగా సీన్ లోకి వెళ్లింది. గంటల వ్యవధిలోనే అక్రమణకు గురైన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసేసింది. ఈ చర్యలతో 'హైడ్రా'పై డిస్కషన్ మరో లెవల్ కి వెళ్లిపోయింది.

హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవలే ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి... ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వరకు విస్తరించి ఉంటుంది.

విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వచ్చాయి. ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా… చాలాచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా చర్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ఫామ్ హౌస్ లు కూడా చర్చకు వస్తున్నాయి.

సంబంధిత కథనం