తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Trap In Mahabubabad : సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా... నిన్నటి వరకు సోషల్ మీడియా స్టార్ - ఇవాళ ఏసీబీకి దొరికేసింది..!

ACB Trap in Mahabubabad : సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా... నిన్నటి వరకు సోషల్ మీడియా స్టార్ - ఇవాళ ఏసీబీకి దొరికేసింది..!

HT Telugu Desk HT Telugu

22 March 2024, 22:09 IST

    • ACB Trap in Mahabubabad :మహబూబాబాద్​ ఆర్వో ఆఫీస్​ లో ఏసీబీ దాడులు కలకలం పేరాయి. లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను అదుపులోకి తీసుకున్నారు. 
ఏసీబీకి చిక్కిన సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా
ఏసీబీకి చిక్కిన సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా

ఏసీబీకి చిక్కిన సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా

ACB Arrested Sub registrar Tasleema: మహబూబాబాద్ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ల్యాండ్ రిజిస్ట్రేషన్​ విషయంలో లంచం డిమాండ్​ చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో శుక్రవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రైడ్​ చేసి లంచం తీసుకుంటున్న సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్​ తో(Sub registrar Tasleema) పాటు ఆఫీస్​ డేటా ఎంట్రీ ఆపరేటర్​ వెంకటేశ్​ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Fish Prasadam : జూన్ 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు

Do Dham IRCTC Tour Package : కేదార్ నాథ్, బద్రీనాథ్ దో ధామ్ యాత్ర- 7 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

TS ECT Results 2024 : తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

Mobile Addiction: ఫోన్‌లో చదివేద్దాం, పాఠాలు విందాం,పేరెంట్స్ ఓ లుక్ వేయండి, ఆన్‌లైన్‌లో సరికొత్త వినోదం

 మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ ఇటీవల దంతాలపల్లి గ్రామంలో 128 గజాల ప్లాట్ కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయించుకునేందుకు ఇటీవల మహబూబాబాద్​ లోని సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడున్న సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా(Sub registrar Tasleema Mohammed) లంచం డిమాండ్​ చేశారు. తన ఆఫీస్​ లో ఔట్​ సోర్సింగ్​ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్​ గా పని చేస్తున్న ఆలేటి వెంకటేశ్​ ద్వారా లంచం డిమాండ్​ చేసింది. అన్నీ డాక్యుమెంట్స్​ సక్రమంగానే ఉన్నా లంచం ఇవ్వడం ఇష్టం లేని హరీష్​ ఇటీవల వరంగల్ రేంజ్​ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. అక్కడ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య పథకం ప్రకారం శుక్రవారం సాయంత్రం రిజిస్ట్రేషన్​ చేసేందుకు అధికారులు అడిగిన లంచం డబ్బులు అప్పగించేందుకు హరీష్​ ఆఫీస్​ కు వచ్చాడు. అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్​ వెంకటకేశ్​ కు రూ.19,200 ఇస్తుండగా ఏసీబీ అధికారులు సడెన్​ గా ఎంట్రీ ఇచ్చారు. వెంకటేశ్​ తో పాటు సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్​ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్ తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన వెంకటేష్ పైనా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరించారు.

ఆపరేటర్​ నుంచి మరో 1.72 లక్షలు స్వాధీనం

హరీష్​ నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే ఎంట్రీ ఇచ్చి ఆలేటి వెంకటేశ్​ ను పట్టుకున్న పోలీసులు అనంతరం ఆఫీస్​ లో సోదాలు నిర్వహించారు. సబ్​ రిజిస్ట్రార్​ ఛాంబర్​ తో పాటు కార్యాలయ సిబ్బంది టేబుళ్లను కూడా చెక్​ చేశారు. ఈ తనిఖీల్లో వెంకటేశ్​ టేబుల్​ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడ్డాయి. దాదాపు రూ.1,72,000 వెంకటేశ్​ వద్ద లభించగా.. వాటికి సంబంధించిన ఆధారాలు ఏమీ కనిపించలేదు. దీంతో అవన్నీ రిజిస్ట్రేషన్​ ఆఫీస్​ కు వచ్చిన లంచాల డబ్బులేనని ఆరోపణలు వినిపించాయి. లెక్కల్లో లేని అంత డబ్బు పట్టుబడటంతో కార్యాలయ మిగతా సిబ్బంది కూడా షాక్​ కు గురయ్యారు. కాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆ డబ్బులను కూడా స్వాధీనం చేసుకుని సీజ్​ చేశారు. ఆ డబ్బులు ఎక్కడికి, ఎవరు, ఏ పని కోసం ఇచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు.

ఏసీబీ రైడ్స్​ తో కలకలం

తస్లీమా మహమ్మద్​ ఇదివరకు ములుగు సబ్​ రిజిస్ట్రార్​ గా పని చేశారు. అక్కడ పని చేస్తున్న సమయంలో ఆమె మంచి పేరు సంపాదించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తారనే పేరు కూడా ఆమెకు ఉంది. ఓ వైపు సబ్​ రిజిస్ట్రార్​ గా విధులు నిర్వర్తిస్తూనే పొలం పనులు చేస్తూ ఉండేది. దీంతో ఆమె పొలం పనులు చేస్తున్న వీడియోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతుండేవి. ఇన్నిరోజులు సైలెంట్​ గా ఉన్న తస్లీమా మహమ్మద్​ ఒక్కసారిగా ఏసీబీ అధికారులకు చిక్కడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశమైంది. కాగా ఇన్నిరోజులు ఎలాంటి రిమార్క్​ లేకుండా పని చేసిన తస్లీమా(Mahabubabad Sub registrar Tasleema Mohammed) ఈ ఒక్క ఘటనతో తన పేరును మొత్తం పోగొట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే ఆమెను రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు ములుగులో పని చేసిన సమయంలో ఏమైనా అక్రమాలకు పాల్పడిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. మరి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం