Warangal Tragedy : వరంగల్ జిల్లాలో విషాదం.. క్రెడిట్ కార్డుల కిస్తీలు కట్టలేక యువకుడు ఆత్మహత్య
21 October 2024, 9:44 IST
- Warangal Tragedy : బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని ఆ యువకుడు ఏకంగా 10 క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు వాడేశాడు. కానీ.. మళ్లీ తిరిగి చెల్లించే పరిస్థితి లేదు. ఇంట్లో వాళ్లకు చెప్పాడు. సర్లే.. ఏదోలా చేసి కడదామని అతని తండ్రి చెప్పారు. అయినా ఆ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.
క్రెడిట్ కార్డుల కిస్తీలు కట్టలేక యువకుడు ఆత్మహత్య
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో విషాదం జరిగింది. క్రెడిట్ కార్డుల కిస్తీలు చెల్లించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అప్పులు కడదామని చెప్పినా.. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. అతని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాచినపల్లి గ్రామానికి చెందిన దార ప్రసాద్(38) డిగ్రీ పూర్తి చేశాడు. ఏడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. పలు బ్యాంకులు అతనికి క్రెడిట్ కార్డులు ఆఫర్ చేశాయి. ఆయా బ్యాంకుల నుంచి 10 వరకు క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. లిమిట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేశాడు. దాదాపు అన్ని కార్డులను ఉపయోగించుకున్నాడు.
కానీ.. నెలవారీ కిస్తీలు చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి.. అప్పులు ఎక్కువయ్యాయి. కిస్తీలు కట్టకపోవడంతో.. బ్యాంకు అధికారులు తరచూ ఫోన్లు చేస్తున్నారు. వారు ఫోన్ చేసిన ప్రతీసారి.. వాయిదాలు పెడుతూ వచ్చాడు. ఈ నెల 10న ప్రసాద్ దసరా పండగకు సొంతూరు నాచినపల్లికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ బాధపడుతున్నాడు.
అతన్ని గమనించిన తండ్రి రాములు.. ఏమైందని అడిగారు. అప్పుడు ప్రసాద్ అసలు విషయం చెప్పాడు. దీంతో.. బాధపడకు ఎక్కడైనా అప్పు తెచ్చి చెల్లిద్దామని తండ్రి ధైర్యం చెప్పారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లారు. ఏమనుకున్నాడో తెలియదు గానీ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రసాద్ ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పొలం పనులు ముగించుకొని ప్రసాద్ తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చారు. విగతజీవిగా మారిన కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించారు. అప్పులు కడతామని చెప్పినా.. ఆత్మహత్యకు పాల్పడ్డావా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాములు దుగ్గొండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.