Rajinikanth Amitabah Bachchan: అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మేసిన మెగాస్టార్.. రోజూ 18 గంటలు పనిచేశాడు: రజనీకాంత్
Rajinikanth Amitabah Bachchan: మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అప్పులు తీర్చడానికి తన ఇల్లు అమ్మేసిన విషయాన్ని, రోజుకు 18 గంటలు పని చేసిన రోజులను గుర్తు చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పుడీ ఇద్దరూ కలిసి నటించిన వేట్టయన్ మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Rajinikanth Amitabah Bachchan: అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ మెగాస్టార్. ఐదు దశాబ్దాలకుపైగా సిల్వర్ స్క్రీన్ ను ఏలుతున్నాడు. కానీ రెండున్నర దశాబ్దాల కిందట అతడు దారుణంగా అప్పుల పాలై ఉన్న ఇంటిని అమ్ముకున్న విషయం తెలుసా? తాజాగా బిగ్ బీతో కలిసి వేట్టయన్ మూవీ చేసిన రజనీకాంత్ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ చెప్పిన విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.
మంకీ క్యాప్ వేసుకొని ఆ నిర్మాత ఇంటికి..
అమితాబ్ బచ్చన్ అప్పుల ఊబిలో చిక్కుకున్న సమయంలో ఎలాంటి దుర్బరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడో రజనీకాంత్ గుర్తు చేసుకున్నాడు. మంకీ క్యాప్ వేసుకొని నిర్మాత యశ్ చోప్రా ఇంటికి అతడు వెళ్లి విషయం కూడా చెప్పాడు. అలాంటి స్థితిలోనూ బిగ్ బీ సాయం తీసుకోవడానికి సిద్ధపడలేదనీ వెల్లడించాడు.
"ఒకరోజు ఆయన యశ్ చోప్రా ఇంటికి మంకీ క్యాప్ వేసుకొని వెళ్లాడు. ఎందుకంటే అతనికి ఆ సమయంలో డ్రైవర్ కూడా లేడు. యశ్ ని పని కోసం అడిగాడు. యశ్ వెంటనే ఓ సంతకం చేసిన చెక్ ఆయనకు ఇచ్చాడు. కానీ అమిత్ జీ దానిని తీసుకోలేదు. తనకు పని ఇస్తేనే తీసుకుంటానని అన్నాడు. అలా ఆయనకు మొహబ్బతే మూవీ దక్కింది. ఆ తర్వాత కేబీసీ కూడా" అని రజనీ తెలిపాడు.
రోజూ 18 గంటలు పని చేశాడు
అమితాబ్ బచ్చన్ కు తన పనిపై ఎంతటి అంకితభావం ఉందో కూడా ఈ సందర్భంగా రజనీకాంత్ గుర్తు చేశాడు. "ఆయన ఆ సమయంలో చేయాల్సినవన్నీ చేశాడు. అన్ని రకాల యాడ్స్ చేశాడు. బాంబేలోని ఇండస్ట్రీ ప్రముఖులు కొందరు ఇది చూసి నవ్వుకున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మూడేళ్ల పాటు రోజుకు 18 గంటలు పనిచేశాడు.
తన అప్పులన్నీ తీర్చేశాడు. తన పాత ఇంటికి తిరిగి కొనడమే కాదు.. అదే వరుసలో ఉన్న మరో మూడు ఇళ్లు కూడా కొన్నారు. అదీ అమితాబ్ బచ్చన్ అంటే.. ఇప్పుడాయనకు 82 ఏళ్లు.. ఇప్పటికీ రోజులకు 10 గంటలు కష్టపడతాడు" అని రజనీకాంత్ అన్నాడు.
అమితాబ్ బచ్చన్ తో కలిసి రజనీకాంత్ 1991లో వచ్చిన హమ్ మూవీలో నటించాడు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత వేట్టయన్ మూవీతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. కెరీర్లో మెగాస్టార్ గా ఎదిగినా కూడా బిగ్ బీ తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం.
ఇదే అతన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లింది. అయితే రజనీ చెప్పినట్లు మొహబ్బతే మూవీతోపాటు కౌన్ బనేగా క్రోర్‌పతి షోతో మళ్లీ గాడిలో పడిన బిగ్ బీ.. అప్పులు తీర్చడంతోపాటు అంతకు ఎన్నో రెట్ల ఆస్తులను మళ్లీ సంపాదించుకున్నాడు. ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీలో కనిపించిన అమితాబ్.. ఇప్పుడు వేట్టయాన్ మూవీతో రాబోతున్నాడు. ఇక తనకు తిరిగి ప్రాణం పోసిన కేబీసీ 16వ సీజన్ కూడా చేస్తున్నాడు.