Rajanna Sircilla : ఆర్థిక ఇబ్బందులతో సతమతం.. సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య
Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర సంక్షోభం నేత కార్మికులకు శాపంగా మారింది. ఉపాధి లేమితో నేతన్నలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. సాంచల్ నడవక.. చేసేందుకు పని లేక.. ఉపాధి కానరాక ఓ నేత కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నేత కార్మికులకు నిలయమైన సిరిసిల్ల ఉరిశాలగా మారుతుంది. బివై నగర్‌కు చెందిన ఆడెపు సంపత్ (52) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, పవర్ పరిశ్రమ బంద్ కావడమే కారణమని కుటుంబ సభ్యులు అంటున్నారు. గత నాలుగైదు నెలలుగా సరిగా పని లేక.. వేరే పని చేయలేక ఉపాధి కోల్పోయారని చెబుతున్నారు.
అప్పుల పెరిగి.. వాటిని తీర్చే దారిలేక బలవన్మరణానికి పాల్పడినట్టు సంపత్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తెలిపారు. వస్త్ర పరిశ్రమ సరిగా పనిచేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. గత పది మాసాల్లో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారని నేత కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నేత కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మూతపడ్డ వస్త్ర పరిశ్రమ..
వస్త్ర సంక్షోభంతో ఈనెల 6 నుంచి టెక్స్ టైల్ పార్కు తోపాటు పవర్ లూమ్ పరిశ్రమ బంద్ అయింది. వస్త్ర పరిశ్రమ బంద్ కావడంతో దానిపై ఆధారపడి జీవించే నేత కార్మికులు పుట్టెడు కష్టాలను ఎదుర్కొంటున్నారు. 15 రోజులుగా పని లేకపోవడంతో.. రెక్కాడితేగానీ దొక్కనిండని నేత కార్మిక కుటుంబాలు ఆర్దిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. ఇకపై నేతన్నలు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి.. ఉపాధి కల్పించేలా ఆర్డర్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఇది ప్రభుత్వ హత్య..
నేత కార్మికుడి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. నేత కార్మికుడిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఈసారి బతకమ్మ చీరల ఆర్డర్స్ కూడా ఇవ్వకపోవడంతో.. నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నేసిన గుడ్డకు గిరాకీ లేక, విద్యుత్ సబ్సిడీ రాక.. పపర్ లూమ్ పరిశ్రమ నడవక.. దానిపై ఆధారపడి జీవించే నేత కార్మికులు ఉపాధి కోల్పోయారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడకుండా.. ప్రభుత్వం వెంటనే నేత కార్మికులకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)