Medak District : చేతబడి నెపంతో మహిళపై దాడి - పెట్రోల్ పోసి సజీవ దహనం
04 October 2024, 16:38 IST
- మెదక్ లో దారుణం వెలుగు చూసింది. చేతబడి నెపంతో ఓ మహిళను దారుణంగా కొట్టారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
మెదక్ లో దారుణం
ప్రపంచమంతా సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న ప్రస్తుత రోజుల్లో మూఢ నమ్మకాల పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు. చేతబడి చేస్తుందన్న కారణంతో ఒ మహిళను అత్యంత దారుణంగా కొట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో డేగల ముత్తవ్వ (45) అనే మహిళ జీవిస్తోంది. అయితే ఆమె మంత్రాలూ చేస్తుందనే అనుమానంతో గురువారం రాత్రి ఇంట్లో ఉన్న ముత్తవ్వపై ఆ ఊరి గ్రామస్థులు దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలను ఆర్పి… పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న రామాయంపేట పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని బాధిత మహిళను చికిత్స నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముత్తవ్వ శుక్రవారం మృతి చెందింది. దీంతో మృతురాలి భర్త పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎంతో దారుణం - మెదక్ జిల్లా ఎస్పీ
ఇవాళ మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక కాలంలో కూడా మంత్రాలు, మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. మంత్రాల నెపంతో ఓ మహిళను సజీవ దహనం చేయడం దారుణమైన విషయమన్నారు. ఈ సంఘటన సభ్యసమాజం తల తించుకునేలా ఉన్నదన్నారు. మూఢ నమ్మకాలపై మెదక్ జిల్లా పోలీస్ కళా బృందం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ... ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదన్నారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపడతామన్నారు. ప్రజలు ఎవరు మూఢ నమ్మకాలైన మంత్రాలను నమ్మవద్దని, పాత కక్షలు మనసులో పెట్టుకుని మంత్రాలు చేస్తున్నారనే నెపంతో చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలు మారాలని ఎవరికైనా అనుమానాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
బాద్యులైన వారిపై కఠిన చర్యలు .....
ఈ సంఘటనకు బాద్యులైన వారిపై కఠినమైన చట్టాలను అమలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించేందుకు అవహగహన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.