Sangareddy Accident : కంటైనర్‌లో మంటలు.. 8 కార్లు దగ్ధం.. రూ.2 కోట్ల నష్టం
11 November 2024, 13:18 IST
- Sangareddy Accident : రోడ్డుపై వెళ్తున్న కంటైనర్‌లో హఠాత్తుగా పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ వాహనాన్ని పక్కన నిలిపివేశారు. అప్పటికే కంటైనర్‌లో తరలిస్తున్న కార్లకు మంటలు వ్యాపించాయి. డ్రైవర్ ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. 8 టాటా నెక్సాన్ కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
కంటైనర్‌లో మంటలు
జహీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ముంబయి నుండి 8 టాటా నెక్సాన్ కార్లను కంటైనర్‌లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఆ వాహనం జహీరాబాద్ లోని రంజోల్ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపైకి వచ్చింది. ప్రమాదవశాత్తు కంటైనెర్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వాహనాన్ని పక్కకు ఆపాడు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. మంటలు వ్యాపించి డ్రైవర్ ఒంటికి అంటుకొని గాయాలయ్యాయి. డ్రైవర్ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు అప్రమత్తమై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన జహీరాబాద్ పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అప్పటికే కంటైనర్‌లో తరలిస్తున్న కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కంటైనర్ కాలిపోయింది. ఈ ఘటనతో ముంబయి- హైదరాబాద్ హైవే పైన ఆర గంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
రూ. 2 కోట్లకు పైగా నష్టం..
సాంకేతిక సమస్యతో కంటైనర్‌లో మంటలు చెలరేగి ఉండవచ్చని కంపెనీ అధికారులు అనుమానిస్తున్నారు. కంటైనర్‌లో తరలిస్తున్న 8 కార్లు పూర్తిగా కాలిపోయాయి. రూ. 2 కోట్ల పైనే ఆస్తి నష్టం జరిగినట్లు సంబంధిత కంపెనీ అధికారులు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ కూడా గాయాల పాలయ్యాడు. అతనికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు వివరించారు.
మెదక్‌లో..
గొనె సంచుల గోదాములో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. నిజాంపేట మండల కేంద్రంలోని జిట్టి చంద్రశేఖర్‌కు చెందిన గొనె సంచుల గోదాములో మంటలు చెలరేగాయి. స్థానికులు యజమానికి సమాచారం అందించారు. అతడు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గొనె సంచులు, వ్యాపారి అమ్మకానికి తీసుకొచ్చిన చీరలు, గాజులు పూర్తిగా కాలిపోయాయి. రూ. 3 నుంచి 4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయారు.