తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Graduate Mlc Elections : ఓటర్ తుది జాబితాకు కసరత్తు - 28 వేల మంది పట్టభద్రుల దరఖాస్తులు తిరస్కరణ

TG Graduate MLC Elections : ఓటర్ తుది జాబితాకు కసరత్తు - 28 వేల మంది పట్టభద్రుల దరఖాస్తులు తిరస్కరణ

HT Telugu Desk HT Telugu

21 November 2024, 8:11 IST

google News
    • ఉత్తర తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తును అధికారులు ముమ్మరం చేశారు. ఓటర్ నమోదు కోసం ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాల్లో పరిధిలో 3లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకోగా 28 వేల మంది దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి.
ఉత్తర తెలంగాణలో 3,16,663 మంది పట్టభద్రుల ఓటర్లు
ఉత్తర తెలంగాణలో 3,16,663 మంది పట్టభద్రుల ఓటర్లు

ఉత్తర తెలంగాణలో 3,16,663 మంది పట్టభద్రుల ఓటర్లు

ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవికాలం మరో మూడు నెలల్లో ముగుస్తుంది. గడువులోగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించే కసరత్తు ఎలక్షన్ కమీషన్ చేస్తుంది. ఓటర్ల నమోదు కోసం సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు.

నాలుగు ఉమ్మడి జిల్లాలో పది లక్షలకు పైగా పట్టభద్రులు ఉంటే కేవలం 3 లక్షల 58 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు ఇప్పటికే 28 వేల దరఖాస్తులను తిరస్కరించి 316663 మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేశారు. పట్టభద్రులు ఓటర్ గా నమోదుకావడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినప్పటికీ ఇది గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 80 నుంచి 90% అదనంగా పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. గత ఎన్నికలప్పుడు ఒక లక్షా 93 వేల మంది పట్టభద్రులు ఓటుగా నమోదు అయ్యారని గతంతో పోల్చితే ఈసారి రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారం చేయడంతో ఓటర్ ల సంఖ్య పెరిగిందని తెలిపారు.

డిసెంబర్ 7 వరకు అభ్యర్థనలు స్వీకరణ

పట్టభద్రుల ఓటర్ నమోదు కావడానికి ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం తిరస్కరించబడ్డ వారి అభ్యర్థనలు ఈనెల 23 నుంచి డిసెంబర్ 7 వరకు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థనలు పరిశీలించిన తర్వాత ఓటర్ లిస్టు ప్రకటిస్తామని తెలిపారు.

ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారులు అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై సమీక్షించారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నిక పోలింగ్ కోసం ఈసారి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని 15 జిల్లాల్లో 449 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 30న ఓటరు తుది జాబితా

గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన మీదట నవంబర్ 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలియజేయవచ్చన్నారు. 2

024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను వెలువరించడం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు అభ్యంతరాలు స్వీకరించు సమయంలో అర్హులైన వారు ఓటర్లు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు. ఇట్టి ప్రక్రియ నామినేషన్ చివరి తేది వరకు కూడా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకొనుటకు అవకాశం కల్పించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

 

తదుపరి వ్యాసం