AP Assembly Bills : ఎంత మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులే-ఏడు కీలక బిల్లులు ఆమోదం
AP Assembly Bills : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఏడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. వీటిల్లో కీలకమైన మున్సిపల్ సవరణ బిల్లు ఉంది. ఈ సవరణతో పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత మంది పిల్లలున్నా పోటీ చేసేందుకు అర్హత లభించినట్లైంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏడు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024 సహా ఏడు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా తీసుకొచ్చిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. జనాభా వృద్ధి రేటులో భాగంగా ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందిదే కొత్త చట్టం అమల్లోకి రానుంది.
ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు-2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు-2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. వీటితోపాటు ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు-2024 ఆమోదం పొందింది. ఏడు బిల్లుల ఆమోదం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.
అంతకు ముందు సభలో జగనన్న కాలనీల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. జగనన్న కాలనీలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని స్పీకర్ ఆదేశించారు. అధికారుల నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు వ్యాత్యాసం ఉందన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రతకు పెద్దపీట
మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని 48 గంటల్లో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపించిన ఘనత కూటమి సర్కార్ దని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ముచ్చుమర్రి ఘటనలో బాధితురాలిని గుర్తించడానికి సమయం పట్టిందన్నారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, పరామర్శకు వెళ్లిన తమపైనే కేసులు పెట్టారన్నారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారని, అసలు దిశ చట్టం ఉందా? దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశ చట్టం ప్రకారం కేసులు పెట్టారన్నారు. గంజాయిపై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా? కూటమి ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్దపీట వేసిందన్నారు.
"చిన్నారులపై అఘాయిత్యాలను స్వార్థంతో రాజకీయం చేయకండి. సున్నితమైన అంశాలలో తల్లిదండ్రుల మానసిక వేదనను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. 2023, 2024లో నేరాల శాతాన్ని పరిశీలిస్తే చాలదా? ఎవరి హయాంలో ఎన్ని నేరాలు, ఘోరాలు జరిగాయో తేల్చడానికి? 2014 సమయంలో టీడీపీ ప్రభుత్వంలో తీసుకువచ్చిన 'ఫోర్త్ లయన్' యాప్ నే దిశగా చెప్పుకున్నారు. మహిళా పోలీస్ స్టేషన్లను దిశ స్టేషన్లుగా మార్చుకున్నారు. వైసీపీ చెప్పే దిశ ఉంటే గత ఐదేళ్లూ నేరాల్లో ఏపీని అగ్రభాగాన నిలబెట్టారెందుకు? ఉన్న 'నిర్భయ' చట్టాన్ని గాలికి వదిలేసి దిశ చట్టం పేరుతో కాలక్షేపం చేసి ఎంతో మందిని పొట్టనపెట్టుకున్నారు. మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఏ ఘటన జరిగినా ఒక్కరోజులోనే పట్టుకున్నాం. 48 గంటల్లోనే రిమాండ్ కు పంపాం"- హోంమంత్రి అనిత
సంబంధిత కథనం