karimnagar Accident : కరీంనగర్ జిల్లాలో కారు బీభత్సం - ముగ్గురు మృతి
కరీంనగర్ జిల్లాలో కారు భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పాదచారులపైకి కారు దూసుకెళ్ళడంతో ఇద్దరు కూలీలు తోపాటు కారు నడిపే బీజేపీ నాయకుడు మృతి చెందారు. దీంతో రాజీవ్ రహదారి రక్తసిక్తమైంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులో రామంచ క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన నడుచుకుంటు వెళ్ళున్న వారిపైకి దూసుకెళ్లింది. ఇద్దరు కూలీలపై నుంచి దూసుకెళ్లిన కారు డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ పడింది.
కారు ఢీ కొట్టడంతో ఇద్దరు బిహార్ కు చెందిన వలస కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. కారు వేగంగా డివైడర్ ను ఢీ కొట్టి పల్టీకొట్టడంతో కారు నడిపే బెజ్జంకి మండల బిజేపి మాజీ అద్యక్షులు తాడూరి వెంకట్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వెంకట్ రెడ్డి స్వగ్రామం బెజ్జంకి మండలం లక్ష్మీపూర్. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు. కరీంనగర్ లో పని చూసుకుని ఇంటికి వెళ్తుండగా రామంచ క్రాసింగ్ వద్ద ప్రమాదానికి గురయ్యారు.
వేగం తీసిన ముగ్గురి ప్రాణాలు
కారు వేగంగా వెళ్లడంతో క్రాసింగ్ వద్ద కంట్రోల్ తప్పి కూలీల పైకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. కూలీలను ఢీ కొట్టిన కారు… డివైడర్ ను ఢీ కొట్టడంతో డ్రైవర్ వెంకట్ రెడ్డి కారులో నుంచి ఎగిరి రోడ్డుపై పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన ఇద్దరు కూలీలు సమీపంలోని సిమెంట్ పంపుల కంపెనీలో పనిచేసే బీహార్ కు చెందిన వలస కూలీలుగా గూర్తించారు. ఇద్దరు కూలీలు కొత్తపల్లి నుంచి పైపుల కంపెనీ వైపు వెళ్తుండగా కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.
వెంకట్ రెడ్డి మృతి పట్ల బిజేపి నాయకులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు.