తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Master Plan : మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. 10 ముఖ్యమైన అంశాలు

Medaram Master Plan : మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. 10 ముఖ్యమైన అంశాలు

28 November 2024, 10:25 IST

google News
    • Medaram Master Plan : మేడారం.. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వన దేవతల క్షేత్రం. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో వనం కిక్కిరిసిపోతుంది. ఇటీవల నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందిచనుంది.
మేడారం
మేడారం

మేడారం

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకోసారి జరిగే ఈ వనదేవతల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. గతంలో కేవలం జాతర సమయంలోనే భక్తులు వచ్చేవారు. కానీ ఇప్పుడు నిత్యం వేల మంది అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.

1.మేడారంలోని దేవతల గద్దెల ప్రాంగణం విస్తరణకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందనుంది.

2.నాలుగు దశాబ్దాల కిందట దాతలు నిర్మించిన గద్దెల ప్రాంగణమే ఇప్పటికీ అందుబాటులో ఉంది. జాతరకు ముందు అప్పుడప్పుడు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. కానీ శాశ్వతంగా అభివృద్ధి చేయడం లేదు.

3.గద్దెల ప్రాంగణం వద్ద ఎలాంటి మార్పులు చేయకపోవడంతో.. జాతర సమయంలో భక్తుల నియంత్రణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

4.ఇప్పటికే మేడారం వెళ్లే రహదారుల అభివృద్ధికి రూ.17.50 కోట్లు, గెస్ట్ హౌస్‌ల నిర్మాణాలకు రూ.3.50 కోట్లు మంజూరు చేసి.. పనులు చేపట్టారు.

5.తాజాగా.. వనదేవతల గద్దెల ప్రాంగణంలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందినట్లు అధికారులు చెబుతున్నారు.

6.సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొనేందుకు పస్రా, చింతల్, కొండాయి, తాడ్వాయి మీదుగా మేడారంలో ప్రవేశించి.. గద్దెల ప్రాంగణానికి చేరుకొనేందుకు వీలుగా రోడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

7.అమ్మవార్ల గద్దెల ప్రాంగణానికి చేరుకున్న తర్వాత.. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విశ్రాంతి, ప్రశాంత దర్శనం రెండో ప్రాధాన్యతగా పనులు చేపట్టనున్నారు.

8.దాదాపు ఎకరం స్థలంలో దేవతల గద్దెలు, ప్రాంగణం ఉంది. దీంతో భక్తుల దర్శనానికి గంటలకొద్దీ సమయం పడుతోంది. రాబోయే రోజుల్లో అన్నిరకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అయితే.. హడావుడిగా కాకుండా ప్రణాళికబద్ధంగా నిర్మించేందుకు మాస్టర్‌ప్లాన్‌ సిద్ధమవుతోంది.

9.మేడారం అభివృద్ధిపై మంత్రి సీతక్క స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటీవల అధికారులతో సమీక్షించారు. గద్దెల ప్రాంగణం, మేడారం రోడ్ల విస్తరణకు శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దేవతల దర్శనం, సౌకర్యాల కల్పనతో మేడారానికి మంచి పేరు తీసుకురావాలని ఆదేశించారు.

10.మంత్రి సీతక్క ఆదేశాలతో మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రైవేటు ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. వాటికి అనుమతి రాగానే మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు.

తదుపరి వ్యాసం