Jathara Review: జాతర రివ్యూ - లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Jathara Review: సతీష్‌బాబు, దీయారాజ్ జంటగా నటించిన జాతర మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కథ ఏమిటంటే?
Jathara Review: సతీష్‌బాబు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన జాతర మూవీ శుక్రవారం (నవంబర్ 8న) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీయారాజ్ హీరోయిన్‌గా నటించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
నాస్తికుడి కథ…
చలపతి (సతీష్‌బాబు) నాస్తికుడు. దేవుడిని అస్సలు నమ్మడు. చలపతి తండ్రి పాలేటి ఊరి అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేస్తోంటాడు. అమ్మవారి అండతో ఊరిలోని దురాచారాల్ని రూపుమాపేందుకు పాలేటి ప్రయత్నాలు చేస్తోంటాడు. ఒకరోజు పాలేటితో పాటు గంగావతి అమ్మవారు ఊరి నుంచి మాయమవుతారు. పాలేటి చేసిన చెడు పూజల వల్లే అమ్మవారు ఊరు విడిచి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతుంది.
దాంతో పాలేటి ఫ్యామిలీని శత్రువులుగా చూడటం మొదలుపెడతారు ఊరి ప్రజలు. మరోవైపు చలపతి కుటుంబంతో ఊరి పెద్ద గంగిరెడ్డికి గొడవలు ఉంటాయి. ఈ గొడవలకు కారణమేమిటి? తండ్రిపై పడిన నిందను నాస్తికుడైన చలపతి ఎలా దూరం చేశాడు? ఈ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో చలపతికి అమ్మవారు ఏ విధంగా అండగా నిలిచింది? తండ్రి జాడను పాలేటి ఎలా కనుక్కున్నాడు?
అమ్మవారి అదృశ్యానికి గంగిరెడ్డికి ఉన్న సంబంధం ఏమిటి? అమ్మవారిని మాయం చేయాలన్నది గంగిరెడ్డి కుట్రలను చలపతి ఎలా అడ్డుకున్నాడు? వెంకటలక్ష్మితో (దీయారాజ్) చలపతి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే జాతర మూవీ కథ.
మైథలాజికల్ ట్రెండ్...
ప్రస్తుతం టాలీవుడ్‌లో మైథలాజికల్ సినిమాల ట్రెండ్ ఎక్కువైంది. భక్తి నేపథ్య కథాంశాలతో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. ఈ జానర్‌లో వచ్చిన సినిమానే జాతర.
కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు సతీష్ బాబు ఈ మూవీని తెరకెక్కించాడు. తన భక్తులను అమ్మవారు కాపాడటం అనే పాయింట్‌తో చాలా సినిమాలొచ్చాయి. కానీ వాటికి భిన్నంగా దేవుడినే ఓ నాస్తికుడైన యువకుడు ఎందుకు కాపాడాల్సివచ్చింది? అమ్మవారి అండతో ఎలా దుష్టసంహారాన్ని గావించాడనే అంశాలకు రివేంజ్, లవ్‌స్టోరీతోపాటు మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఇంటర్వెల్ ట్విస్ట్...
గంగావతి గ్రామదేవతతో పాటు పాలేటి పాత్రతోనే ఈ సినిమా పరిచయం అవుతుంది. తండ్రి భిన్న మనస్తత్వంతో చలపతి పెరగడానికి కారణం ఏమిటన్నది చూపించాడు డైరెక్టర్. వెంకటలక్ష్మి, చలపతిల ప్రేమాయణం ఫస్ట్ హాఫ్‌లో టైమ్‌పాస్ చేస్తుంది. ఊరి నుంచి పాలేటితో పాటు అమ్మవారు అదృశ్యమయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.
ఈ మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేశాడు? గంగిరెడ్డి, చలపతి ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు వేసే ఎత్తులు పై ఎత్తులతో సెకండాఫ్‌ను నడిపించాడు డైరెక్టర్. ప్రీ క్లైమాక్స్ తో పాటు క్లైమాక్స్‌లో వచ్చి ట్విస్ట్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ టైమ్ తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. తెలిసిన నటీనటులు లేకపోవడంతో కొంత ప్లస్‌తో పాటు మైనస్ కూడా అయ్యింది.
హీరో కమ్ డైరెక్టర్...
జాతర సినిమాకు దర్శకుడిగా హీరోగా రెండు పడవల ప్రయాణాన్ని ఎలాంటి తడబాటు లేకుండా నడిపించేందుకు చాలానే శ్రమించాడు సతీష్‌బాబు. చలపతి పాత్రలో అతడి యాక్టింగ్ పర్వాలేదనిపిస్తుంది. వెంకటలక్ష్మి పాత్రలో దీయారాజ్ నాచరల్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. విలన్‌గా ఆర్కేనాయుడు నటన ఓకే.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో...
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో భక్తి ప్రధాన సినిమాలొచ్చి చాలా కాలమైంది. కొంత వరకు ఆ లోటును జాతర భర్తీ చేస్తుంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే మెప్పిస్తుంది.
రేటింగ్: 2.75/5