Medaram Dispute: ధార్మిక భవన్ లో వేద పాఠశాల ఏర్పాటుపై వివాదం, ఆందోళనకు దిగిన మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు
Medaram Dispute: వరంగల్‌లో నిర్మించిన ధార్మిక భవన్ లో వేద పాఠశాల ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొంది. వేద పాఠశాల ఏర్పాటును నిరసిస్తూ మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు ఆందోళనకు దిగారు.
Medaram Dispute: వరంగల్ లో పాత సెంట్రల్ జైల్ స్థలం ఎదుట ధార్మిక భవన్Ht నిర్మించిన స్థలంపై మేడారం పూజారులు, ఎండోమెంట్ అధికారులు, భద్రకాళి అర్చకుల మధ్య కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది.
ఆ స్థలాన్ని కొన్నేళ్ల కిందట ప్రభుత్వం తమకు కేటాయించిందని మేడారం సమ్మక్క–సారలమ్మ పూజారులు అంటుంటే.. అదే స్థలంలో మూడేళ్ల కిందట ధార్మిక భవన్ పేరున ఎండోమెంట్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మించడం, ఇప్పుడు అందులోనే వేద పాఠశాల ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుండటంతో ఆదివాసీ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ముఖ ద్వారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో మంత్రి సీతక్క కలగజేసుకుని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
30 ఏళ్ల కిందటే కేటాయింపు
మేడారం మహా జాతర రెండేళ్లకోసారి ఘనంగా జరుగుతుండగా, అక్కడ ఆలయానికి సంబంధించిన ఆఫీసులుగానీ, కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు సరైన బిల్డింగులు లేవు. ఈ క్రమంలోనే మేడారం ఆఫీస్ కోసం 1993లో అప్పటి ఆదివాసీ పూజారులు ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టారు.
మేడారం ఆఫీస్ ఏర్పాటు చేస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు 1994లో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పోరిక జగన్ నాయక్ చొరవతో వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 725లోని 1,014 స్థలాన్ని తమకు కేటాయించినట్లు మేడారం పూజారులు చెబుతున్నారు.
కాగా ఆ స్థలం ప్రస్తుతం దేవాదాయ శాఖ అధీనంలో ఉండగా, రెండేళ్ల కిందట రూ.4 కోట్ల నిధులతో ప్రభుత్వం ధార్మిక భవన్ బిల్డింగ్ నిర్మించింది. ఇందులో సమ్మక్క–సారలమ్మ ఆలయ ఆఫీస్ తో పాటు ఎండో మెంట్ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలు కూడా అందులోనే ఏర్పాటు చేశారు. కాగా ధార్మిక భవన్ నిర్మించినప్పటి నుంచి ఆ బిల్డింగ్ కు సమ్మక్క–సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
వేద పాఠశాలకు కేటాయించడంతో వివాదం
ధార్మిక భవన్ లో ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారుల ఆఫీస్ లు నడుస్తుండగా, అందులో రెండు ఫ్లోర్లను వేద పాఠశాల నిర్వహణకు కేటాయిస్తూ ఇటీవల సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేడారం పూజారులు భగ్గుమన్నారు. తమకు కేటాయించిన స్థలంలో తమ అంగీకారం లేకుండా అధికారులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తమకు కేటాయించిన స్థలంలో ఎండోమెంట్ ఆఫీసుల నిర్వహణకు వాడుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదని, కానీ అందులో వేద పాఠశాల ఏర్పాటు చేస్తే మాత్రం ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు. ధార్మిక భవన్, స్థలం మేడారం ఆలయానికి దక్కకుండా భద్రకాళి ఆలయ అర్చకులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ధార్మిక భవన్ వివాదంతో పాటు తమ ఇతర సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో మహా ధర్నాకు దిగుతామని దాదాపు 15 రోజుల కిందటే మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు అల్టీమేటం జారీ చేశారు.
సమస్య పరిష్కారానికి సీతక్క హామీ
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని గిరిజన పూజారులు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. గద్దెల ప్రధాన గేటు ముందు ధర్నాకు దిగడంతో అధికారులు భక్తుల దర్శనార్థం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ వరంగల్ లోని ధార్మిక భవన్ స్థలాన్ని భద్రకాళి అర్చకులు, అధికారులు తమకు దక్కకుండా వేద పాఠశాల పేరుతో దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
పలుమార్లు ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగపోతే వరంగల్ దేవాదాయ శాఖ ఆఫీసు ఎదుట ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. కాగా మేడారం పూజారుల ఆందోళన విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పూజారులు ఆందోళన విరమించారు. కాగా తరచూ ఈ స్థల వివాదం రచ్చకెక్కుతుండగా, పాలకులు పట్టించుకుని సాధ్యమైనంత తొందరగా సమస్యకు పరిష్కార మార్గం చూపాలని పూజారులు కోరుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం