Medaram Jatara Completed: తిరుగువారం పండుగతో ముగిసిన మేడారం జాతర... భారీగా తరలి వచ్చిన భక్తులు
Medaram Jatara Completed: వనదేవతల సన్నిధి మేడారం తిరుగువారంTiruguvaram పండుగతో మురిసిపోయింది. సమ్మక్క సారమ్మ మహాజాతర మొదలై వారం పూర్తయిన సందర్భంగా గిరిజన పూజారులు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా తిరుగువారం పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Medaram Jatara Completed: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారం గుడిమెలిగె పండుగతో గుడి శుద్ధి కార్యక్రమాలు చేపట్టి మేడారం మహాజాతరకు అంకురార్పణ చేసిన పూజారులు, ఆ తరువాతి వారం మండమెలిగే Mandamelige పండుగ నిర్వహించారు. ఇక మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నుంచి 24వ తేదీ శనివారం వరకు మేడారం మహాజాతరను ఘనంగా జరిపారు. జాతర ప్రారంభమై వారం రోజులు పూర్తయిన సందర్భంగా మేడారంలో బుధవారం తిరుగువారం పండుగ నిర్వహించారు.
ఈ సందర్భంగా సమ్మక్క పూజారులు మేడారంలో తల్లి పూజా మందిరాన్ని శుభ్రం చేశారు. ఆదివాసీ ఆడపడుచులు సమ్మక్క ఆలయాన్ని శుద్ధి చేసి, అందంగా ముస్తాబు చేశారు. అనంతరం పూజాలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్దంగా సమ్మక్కSammakka పూజా సామాగ్రిని గిరిజన పూజారులు గుడిలో భద్రపరిచారు.
ఆదివారం గ్రామంలోని గిరిజనులంతా వన దేవతలకు మొక్కుకున్న కోళ్లు, యాటలతో కుటుంబ సమేతంగా వన భోజనాలకు వెళతారు. ఈ కార్యక్రమంతో ఈ ఏడాది మేడారం మహా జాతర పరిసమాప్తమైనట్లు సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేష్ తెలిపారు.
వన దేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు
మేడారం వనదేవతల మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి జరగగా.. అంతకు కొద్దిరోజుల ముందునుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జాతర సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు మొక్కులు సమర్పించుకున్నారు.
ఇలా ముందస్తు మొక్కులు చెల్లించుకున్నవారే దాదాపు 60 లక్షల మంది వరకు ఉండగా.. జాతర జరిగిన నాలుగు రోజుల్లో కోటి 40 లక్షలకు పైగా భక్తులు మేడారం తరలి వచ్చి, సమ్మక్క సారలమ్మకు Saralamma మొక్కులు పెట్టారు. దీంతో ఈ ఏడాది మహాజాతరకు దాదాపు రెండు కోట్లకు పైగా మంది తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గత శనివారం నిర్వహించిన వనదేవతల వన ప్రవేశ ఘట్టంతో మేడారం మహా జాతరకు తెరపడగా.. తిరుగువారం నాటికి కూడా భక్తుల తాకిడి తగ్గలేదు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన జాతరకు ఇప్పటికీ భక్తులు పోటెత్తుతుండటంతో మేడారం ఎప్పుడూ జన సంద్రాన్ని తలపిస్తోంది.
మొత్తంగా ముందస్తు మొక్కులు, జాతర జరిగిన నాలుగు రోజు, ఆ తరువాత తరలివస్తున్న భక్తులతో దాదాపు రెండున్నర కోట్ల మంది భక్తుల కేవలం ఒక్క నెల రోజుల్లోనే అమ్మవార్లకు మొక్కులు సమర్పించి ఉంటారని, అధికారులు అంచనా వేస్తున్నారు.
తిరుగువారం మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలోని మేడారంలో బుధవారం తిరుగు వారం పండుగ నిర్వహించగా.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు.
ఆదివాసీ పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెలను సందర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహా జాతర ముగిసిన అనంతరం కూడా మేడారం జనసంద్రంగా మారుతోందన్నారు.
జాతరకు వచ్చిన వారితో పాటు కొత్తగా వచ్చే భక్తులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్పారు. తిరుగువారం పండుగ సందర్భంగా దాదాపు రెండు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలిపారు. తిరుగువారం పండుగతో మేడారం మహా జాతర సమాప్తం అవుతుందని పేర్కొన్నారు.
అనంతరం మేడారం మహా జాతరకు సంబంధించిన చిన్న జాతరలు మొదలవుతాయని వివరించారు. కాగా మేడారం జాతరలో శానిటేషన్ ప్రధానమైన అంశం కాగా.. ప్రతి రోజు పారిశుధ్య పనులు నిర్వహించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)