Medaram priest Death: మేడారంలో తీవ్ర విషాదం..వారం గడవక ముందే సమ్మక్క పూజారి మృతి
Medaram priest Death: మేడారం సమ్మక్క తల్లి ప్రధాన పూజారులలో ఒకరు మంగళవారం మృతి చెందారు. మహాజాతర ముగిసి వారం కూడా గడవక ముందే పూజారి ఆకస్మికంగా మరణించడంతో మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది.
Medaram priest Death: మేడారం జాతర ముగిసిన కొద్ది రోజులకే సమ్మక్క పూజారి మృతి చెందడం వారి కుటుంబాన్ని విషాదంలో నింపింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క దేవత ప్రధాన పూజారులలో ఒకరైన సిద్ధబోయిన దశరథ(38) Siddaboina Dasarath మంగళవారం ఉదయం అనారోగ్యానికి గురయ్యాడు.
కళ్ళు తిరుగుతున్నాయని అని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వెంటనే మేడారంలోని ప్రభుత్వ ఆసుపత్రికి Govt Hospital తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు దశరథం ను పరీక్షించి, వైద్య పరీక్షలు చేసి చికిత్స చేస్తుండగానే దశరథం మృతి చెందాడు.
మృతుడికి భార్య విజయ, కుమారుడు అశ్విత్, కూతురు సాత్విక ఉన్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం మహాజాతర జరగగా.. మిగతా పూజారులతో కలిసి దశరథం కూడా వివిధ పూజల్లో పాల్గొన్నారు. అందరితో కలిసి మేడారం ప్రధాన ఘట్టాలన్నీ పూర్తి చేశారు. కాగా ఇంతలోనే దశరథం ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
పది నెలల కిందట మరొకరు
మంగళవారం సిద్ధబోయిన దశరథం ప్రాణాలు కోల్పోగా.. వారి కుటుంబంలో కొద్దిరోజుల కిందటే విషాద ఘటన చోటుచేసుకుంది. దాదాపు పది నెలల క్రితం మృతుడు సిద్ధబోయిన దశరథం సోదరుడైన సిద్ధబోయిన లక్ష్మణరావు ప్రాణాలు విడిచాడు. అనారోగ్యంతోనే లక్ష్మణరావు మృత్యువాత పడగా.. తాజాగా దశరథం కూడా అలాగ్ మరణించారు.
ఇద్దరూ సమ్మక్క పూజారులే కాగా.. ఒకే ఇంట్లో కొద్దికాలంలోనే ప్రధాన పూజారులు ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు పూజారుల మరణంతో మేడారంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. మహా జాతర ముగిసి వారం రోజులు కూడా తిరగకముందే సమ్మక్క పూజారి దశరథం మృతి తెలవగానే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిబ్బంది వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్రకటించారు. వారు లేని లోటు తీర్చలేనిదని ఒక ప్రకటనలో మంత్రి సీతక్క తెలిపారు.
మేడారం జంపన్న వాగు బావిలోకి దిగి ఒకరు గల్లంతు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగు ఇన్ టేక్ బావిలోకి దిగిన ఒక వ్యక్తి గల్లంతు అయ్యాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా నూజివీడు మండలానికి చెందిన అద్దంకి అంజి కుటుంబ సభ్యులతో కలిసి కూలి పని కోసం మేడారం వచ్చాడు. మేడారం మహాజాతర జరుగుతున్న రోజుల్లో వివిధ రకాల పనులు చేసి, ఇక్కడే ఉన్నారు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం జంపన్న వాగులో స్నానం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకునే బాలు ఒకటి, వాగులో ఉన్న బావిలో పడింది. దీంతో బాలు కోసం అద్దంకి అంజి బావిలోకి దిగాడు. బంతి కోసం వెళ్లిన అంజి ఎంతకూ బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడిపోయారు.
వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలోకి దిగి అంజి కోసం తీవ్రంగా వెతికారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అంజి ఆచూకీ లభ్యం కాలేదు.
అప్పటికే చీకటి కమ్ముకోవడంతో పోలీసులు ఫైర్ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లకు కూడా సమాచారం అందించారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయత్నాలు కొనసాగించారు. మంగళవారం రాత్రి వరకూ ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)