Medaram Tribal Fair: మహా జాతరగా మారిన అమరుల నివాళి! గతంలో గిరిజనులకే పరిమితం..నేడు లక్షలాదిగా భక్తులు…
Medaram Tribal Fair: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభమైంది. కోట్లాది మంది తరలివచ్చే మేడారం సమ్మక్క–సారలమ్మ Sammakka Saralamma మహాజాతర బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగుతుంది.
Medaram Tribal Fair: మేడారంలో ఇప్పటికే లక్షలాది మంది మొక్కులు సమర్పించి వెళ్లగా.. నాలుగు రోజుల్లోనే కోటిన్నర మంది వరకు భక్తులు మొక్కులు సమర్పిస్తారని అంచనా. సమ్మక్క సారలమ్మ Sammakka Saralammaలకు మొక్కులు సమర్పించుకోడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి రానున్నారు.
ఇంతపెద్ద మహాజాతరకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉండగా.. తెలంగాణ Telangana ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి, పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మహాజాతరను నిర్వహిస్తోంది.
అసలు ధీర వనితలుగా చెప్పుకునే సమ్మక్క–సారలమ్మ పేరు మీద ఇంత పెద్ద జాతర ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసా.. అసలు మేడారం మహాజాతర వెనుక ఉన్న చరిత్ర ఏంటి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
యుద్ధం చేసిన ధీర వనితలు
చరిత్రకారులు, చరిత్ర పరిశోధకులు చెబుతున్న ప్రకారం సమ్మక్క–సారలమ్మ 12వ శతాబ్ధానికి చెందినవారు. దాదాపు 800 ఏళ్ల కిందట కాకతీయుల చేతిలో పోరాడిన ధీరవనితలుగా వారిద్దరూ గుర్తింపు పొందారు.
సమ్మక్క పుట్టుకకు సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉండగా, అందులో ఒక కథ ప్రకారం.. 12వ శతాబ్ధంలో ప్రస్తుత కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాస Polavalasaను పాలించే గిరిజన దొర మేడరాజు Medaraju కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు Pagididda Raju ఇచ్చి పెళ్లి చేశాడు.
సమ్మక్క–పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. అప్పటికే ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ఏలుతున్న కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కాంక్షతో పొలవాసపై దండెత్తాడు. దీంతో మేడరాజు మేడారం పారిపోతాడు.
మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేక పోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు రగిలిస్తూ రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్ద రాజును అణచివేసేందుకు ప్రతాపరుద్రుడు పథకం రచిస్తాడు.
ఈ మేరకు తన ప్రధానమంత్రి యుగంధరుడితో కలిసి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. ఈ పోరులో కాకతీయులు చేసిన దాడిలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా మారింది.
ఇక శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క చిలుకలగుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన ఆమె అనుచరులకు జాడ మాత్రం కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర కుంకుమ భరణి లభించగా.. దానినే అందరూ సమ్మక్కగా భావించారు.
నివాళులర్పించే కార్యక్రమమే..!
దాదాపు 800 ఏళ్ల కిందట కాకతీయులతో తలపడిన సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న, నాగులమ్మ అందరూ మనుషులే. రాజ్య ప్రజల కోసం కాకతీయులను ఎదురించి, కాకతీయులు చేసిన దండయాత్రలో వారంతా ప్రాణాలు కోల్పోయారు.
ఇందులో సమ్మక్క–సారలమ్మ కాకతీయులతో వీరోచిత పోరాటం చేసి, ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించగా.. ధీరవనితల వీరత్వాన్ని ఇక్కడి ప్రజలు దైవత్వంగా భావించారు. ప్రజల కోసం వారు చేసిన పోరాటమే వారిని దేవతలుగా మార్చగా.. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సమ్మక్క–సారలమ్మను స్మరించుకుంటూ గిరిజనులంతా కలిసి నివాళులర్పించేవారు. అందుకే సమ్మక్క జాతరలో వేద మంత్రోచ్చరణలు ఉండవు. విగ్రహ ఆరాధనలు కూడా కనిపించవు.
గద్దెలపై కంకవనం, కుంకుమ భరిణెలనే సమ్మక్క–సారలమ్మగా భావించి, గిరిజన సంప్రదాయ ప్రకారం వారికి పూజలు చేసేవారు. ఇలా నివాళులు అర్పించే కార్యక్రమమే కాలక్రమేణా జాతరగా మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
గిరిజనుల నుంచి సకల జనుల దాకా
సమ్మక్క–సారలమ్మ గిరిజన బిడ్డలు కాగా.. వారికి చిలుకలగుట్ట మీదనే నివాళులర్పించే కార్యక్రమాన్ని గిరిజనులు జాతరగా నిర్వహించడం ప్రారంభించారు.
1930 కాలం వరకు ఈ జాతరను కేవలం గిరిజనులు మాత్రమే నిర్వహించు కునేవారు. ఆ తరువాతి కాలంలో గిరిజనులు దైవంగా భావించిన సమ్మక్క–సారలమ్మ జాతరకు మేడారం చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కొంతమంది గిరిజనులు తరలివచ్చేవారు.
కాలక్రమేణా ఈ సంప్రదాయం కాస్త అన్ని వర్గాలకు వ్యాపించి, కులమతాలకు అతీతంగా సమ్మక్క జాతరకు తరలి రావడం ప్రారంభించారు. జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అక్కడ రద్దీ పెరిగిపోయింది. దీంతో చిలుకల గుట్ట కింద జాతర నిర్వహించడం మొదలుపెట్టారు.
రాన్రానూ ఇదే జాతర పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందగా.. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి, నిధులు కేటాయించి మరీ ఏర్పాట్లు చేస్తోంది.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)