Medaram Gattamma Temple : మేడారం గట్టమ్మ ఆలయంపై ముదురుతున్న వివాదం- నాయకపోడ్ పూజారులు, జాకారం గ్రామస్థులు పరస్పరం దాడులు-medaram news in telugu gattamma temple issue jakaram mudiraj nayakapodu pandits fight for prayers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Gattamma Temple : మేడారం గట్టమ్మ ఆలయంపై ముదురుతున్న వివాదం- నాయకపోడ్ పూజారులు, జాకారం గ్రామస్థులు పరస్పరం దాడులు

Medaram Gattamma Temple : మేడారం గట్టమ్మ ఆలయంపై ముదురుతున్న వివాదం- నాయకపోడ్ పూజారులు, జాకారం గ్రామస్థులు పరస్పరం దాడులు

HT Telugu Desk HT Telugu
Mar 05, 2024 10:58 AM IST

Medaram Gattamma Temple : మేడారం గట్టమ్మ ఆలయం విషయంలో జాకారం పంచాయతీ, నాయక్ పోడ్ పూజారుల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా సోమవారం పూజల నిర్వహణలో ఇరు వర్గాల మహిళలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.

గట్టమ్మ ఆలయంపై ముదురుతున్న వివాదం
గట్టమ్మ ఆలయంపై ముదురుతున్న వివాదం

Medaram Gattamma Temple : గేట్ వే ఆఫ్ మేడారంగా పేరున్న గట్టమ్మ ఆలయంపై వివాదానికి తెరపడటం లేదు. గట్టమ్మ తల్లి దేవాలయం(Medaram Gattamma Temple) విషయంలో జాకారం గ్రామ పంచాయతీ, నాయక్ పోడ్ పూజారుల మధ్య కొంతకాలం వివాదం నడుస్తుండగా.. సోమవారం మరోసారి ఘర్షణకు దారి తీసింది. ఆదివాసీ నాయకపోడ్ లు వారి కుల దైవంగా భావించి, గట్టమ్మకు నిత్యం పూజలు చేస్తూ వస్తుండగా, ఆ ఆలయం జాకారం పంచాయతీ పరిధిలోకి వస్తుందని, ముదిరాజ్ లే అసలైన పూజారులు అంటూ కొంతకాలం నుంచి ఇక్కడ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి ఇరువర్గాల మధ్య గొడవ జరగగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

మేడారం వెళ్లే భక్తులు మొట్టమొదట ములుగు(Mulugu) జిల్లా జాకారం పంచాయతీ పరిధిలో ఉన్న గట్టమ్మ ఆలయం వద్ద పూజలు చేస్తుంటారు. కాగా కొన్నేళ్లుగా ఈ ఆలయంలో ఆదివాసీ నాయకపోడ్ లు పూజారులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే తమ గ్రామానికి చెందిన ఆలయంలో స్థానిక ముదిరాజ్ లే అసలైన పూజారులంటూ గ్రామస్థులు కొన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాకారం గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థులే(Mudiraj) అసలైన పూజారులని, గ్రామానికి చెందిన దాదాపు వంది మంది ముదిరాజ్ లు సోమవారం గట్టమ్మ ఆలయానికి వచ్చారు. వాళ్లు అంత పెద్ద ఎత్తున తరలివచ్చిన విషయం తెలుసుకున్న ఆదివాసీ నాయకపోడ్ లు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ముదిరాజ్ మహిళలు తామే అసలైన పూజారులమని ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్న ఆదివాసీ నాయక పోడ్(Nayakapodu) మహిళలు వారిని అడ్డుకున్నారు.

ఆలయం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల ఎంట్రీ

గట్టమ్మ తల్లి(Medaram Gattamma Temple) ఆలయంపై హక్కు కోసం ముదిరాజ్, ఆదివాసీ నాయకపోడ్ కులస్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి అదికాస్త దాడులకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో గట్టమ్మ ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల దాడి విషయం తెలుసుకున్న ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ రంజిత్ కుమార్ హుటాహుటిన తమ సిబ్బందితో కలిసి గట్టమ్మ ఆలయం వద్దకు చేరుకొన్నారు. ఇరువర్గాల మహిళలను చెదరగొట్టి, గొడవను ఆపివేశారు. అయినా వారు ససేమిరా అనడంతో పోలీసులు అక్కడే ఉన్నా కూడా మహిళలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అనంతరం వారికి సర్దిచెప్పి పోలీసులు వారిని శాంతింపజేశారు. అనంతరం ఇరువర్గాల వారిని పిలిచి మీ వద్ద ఉన్న హక్కు పత్రాలను చూపించాల్సిందిగా అడిగారు. గట్టమ్మ గుడిపై వివాదం తేలే వరకు గొడవలకు పాల్పడ వద్దని, ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని సీఐ రంజిత్ కుమార్ హెచ్చరించారు.

హద్దులు మార్చారని ఆరోపణ

జాకారం గ్రామ పంచాయతీ నుంచి ముదిరాజ్ కులస్థులు ఇటీవల తమకు హైకోర్టు నుంచి వచ్చిన స్టే ఆర్డర్స్ ఉన్నాయని చెప్పగా నాయకపోడ్ కులస్థులు, పూజారులు సైతం తాము తాతల కాలం నుంచి గట్టమ్మ దేవాలయం వద్ద పూజలు చేస్తున్నామని చెప్పారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర (Medaram Sammakka Saralamma Jatara)సందర్భంగా కూడా ఎదురు పిల్ల పండుగ, తిరుగు వారం పండుగ నిర్వహిస్తున్నామని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాకుండా ములుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గట్టమ్మ ఆలయాన్ని కావాలని ధనార్జనే ధ్యేయంగా బౌండరీలు మార్చి వేశారని నాయకపోడ్ పూజారులు ఆరోపించారు. కొంతమంది నాయకుల వ్యక్తిగత స్వార్థం వల్లే తరచూ గట్టమ్మ ఆలయం విషయంలో గొడవలు జరుగుతున్నాయని నాయకపోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, ఆలయ పూజారి కొత్త సదయ్య, తదితరులు ఆరోపించారు. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో కలిపి మొత్తంగా 7 గట్టమ్మ దేవాలయాలు ఉంటాయని, తమ సంస్కృతీ, సంప్రదాయాలపై జాకారం గ్రామస్థులు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. గట్టమ్మ దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి ఆలయాన్ని పాత పద్ధతిలో ములుగు గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే గట్టమ్మ ఆలయం(Medaram Gattamma Temple)పై హక్కు విషయమై కొన్ని సంవత్సరాలుగా జాకారం ముదిరాజ్ కులస్థులు, ఆదివాసీ నాయకపోడ్ కులస్థులు, పూజారుల మధ్య వివాదం నడుస్తుంది. ఇప్పటికే విషయం హైకోర్టు వరకు వెళ్లింది. కాగా తరచూ ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతుండగా.. పవిత్రంగా భావించే గట్టమ్మ పై వివాదం నడుస్తుండటం భక్తులను కలవరానికి గురి చేస్తోంది. దీంతోనే సాధ్యమైనంత తొందర్లో ఈ వివాదానికి తెరదించాలని ఇరువర్గాలతో పాటు మేడారం సమ్మక్క, సారలమ్మ భక్తులు ములుగు, జాకారం పంచాయతీల ప్రజలు కూడా కోరుతున్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం