తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్

WTC final: డబ్ల్యూటీసీ ఫైనల్లో రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్

Hari Prasad S HT Telugu

08 May 2023, 17:53 IST

google News
    • WTC final: డబ్ల్యూటీసీ ఫైనల్లో రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. ఐపీఎల్లో గాయపడిన రాహుల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరమైన విషయం తెలిసిందే.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (Getty)

కేఎల్ రాహుల్

WTC final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్ గాయపడటంతో అతని స్థానంలో ఇషాన్ కు అవకాశం ఇచ్చారు. సోమవారం (మే 8) బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 7 నుంచి ఇంగ్లండ్ లోని ఓవల్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాతో ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్న విషయం తెలిసిందే.

రాహుల్ ప్లేస్ ను ఇషాన్ తో భర్తీ చేసినా.. జైదేవ్ ఉనద్కట్, ఉమేష్ యాదవ్ లపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఇద్దరు కూడా గాయాలతో బాధపడుతున్నారు. గత వారం ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. అతని కుడి తొడకు తీవ్ర గాయమైంది. ఆ మ్యాచ్ లో అతడు చివర్లో వచ్చి బ్యాటింగ్ చేసినా.. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.

దీంతో ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్ లతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా రాహుల్ దూరమయ్యాడు. రాహుల్ కు సర్జరీ అవసరమని, ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్ కోసం వెళ్తాడని బీసీసీఐ వెల్లడించింది. బోర్డు ప్రకటనకు మూడు రోజుల ముందే తాను లండన్ వెళ్లడం లేదని రాహుల్ స్పష్టం చేశాడు.

ఇక ఆ మ్యాచ్ కు ముందు రోజు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ జైదేవ్ ఉనద్కట్ కూడా గాయపడ్డాడు. అతని భుజానికి తీవ్ర గాయం కావడంతో ఐపీఎల్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్ అకాడెమీలో ఉన్నాడు. అతని పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. మరోవైపు ఉమేష్ యాదవ్ కూడా ఎడమకాలి పిక్క గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు కేకేఆర్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ రిజర్వ్ ప్లేయర్స్ గా ఉన్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే టీమ్ ఇదే

రోహిత్, శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లి, రహానే, భరత్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, సిరాజ్, ఉమేష్, జైదేవ్ ఉనద్కట్, ఇషాన్ కిషన్

తదుపరి వ్యాసం