Mumbai Defeats Kolkata: కోల్‌కతాపై ముంబయి ఘనవిజయం.. అర్ధశతకంతో అదరగొట్టిన ఇషాన్
Mumbai Defeats Kolkata: వాంఖడే వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇషాన్ కిషన్(58) అర్ధశతకంతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ రాణించాడు.
Mumbai Defeats Kolkata: కోల్‌కతా నైట్ రైడ్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2023 22వ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స ఘనవిజయం సాధించింది. 186 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలుండగానే ఛేదించింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ముంబయి బ్యాటర్లలో ఇషాన్ కిషన్(58) అర్ధశతకంతో విజృంభించగా.. సూర్యకుమార్ యాదవ్(43) రాణించాడు. మిగిలిన వారు ఓ మోస్తరుగా ఆకట్టుకోవడంతో ముంబయి ఈ ఐపీఎల్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. కేకేఆర్ బౌలర్లలో సుయాష్ శర్మ 2 వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, లోకీ ఫెర్గ్యూసన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
186 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్‌కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(20) అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇషాన్(58) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోల్‌కతా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి బౌండరీల వర్షం కురిపించాడు. క్రీజులో ఉన్నంత సేపు వేగంగా ఆడిన ఇషాన్.. తన పర్ఫార్మెన్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోపక్క రోహిత్ శర్మ 2 సిక్సర్లు సహా ఓ ఫోర్ కొట్టి 20 పరుగులు సాధించాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో సుయాష్ బౌలింగ్‌లో ఉమేష్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు రోహిత్. ఫలితంగా 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. ఇషాన్‌తో కలిసి నిలకడగా ఆడాడు. ఓ పక్క ఇషాన్ దూకుడుగా ఆడుతూ స్కోరు వేగం పెంచాడు. ఇదే క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 25 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. దూకుడుగా ఆడుతున్న ఇషాన్‌ను కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ(30).. సూర్యకుమార్ యాదవ్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ నిలకడగా ఆడారు. ఫలితంగా వీరిద్దరూ మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించారు.
ప్రమాదకరంగా మారుతున్న తిలక్ వర్మను సుయాష్ శర్మ పెవిలియన్ చేర్చాడు. అతడు ఔటైనప్పటికీ సూర్యకుమార్ మాత్ర పట్టు వదల్లేదు. టిమ్ డేవిడ్(24*)తో కలిసి లక్ష్యం దిశగా దూసుకెళ్లాడు. విజయానికి మరో 10 పరుగుల దూరంలో ఉండగా సూర్యకుమార్ శార్దూల్ బౌలింగ్ వెనుదిరిగాడు. అతడి తర్వాత స్వల్ప వ్యవధిలోనే నేహాల్ (6)కూడా ఔటైనప్పటికీ.. టిమ్ డేవిడ్, కేమరూన్ గ్రీన్(1*) కలిసి లక్ష్యాన్ని ఛేదించారు. ఫలితంగా కోల్‌కతాపై ముంబయి 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్(104) సెంచరీతో కదం తొక్కగా.. చివర్లో రసెల్(21) మెరుపులు మెరిపించాడు. అయితే మిగిలిన వారు పెద్దగా రాణించకపోవడంతో కేకేఆర్ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. అయినప్పటికీ వెంకటేష్ సెంచరీతో మెరుగైన స్కోరు సాధించింది. ముంబయి బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 సెంచరీలు చేయగా.. కేమరూన్ గ్రీన్, డ్వాన్ జన్సెన్, పియూష్ చావ్లా, రిలే మెరిడెత్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.