Virat Kohli Instagram followers: కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 25 కోట్లు.. ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్
26 May 2023, 13:27 IST
Virat Kohli Instagram followers: కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 25 కోట్లకు చేరారు. దీంత ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ గా అతడు నిలవడం విశేషం.
25 కోట్లకు చేరిన విరాట్ కోహ్లి ఇన్‌స్టా ఫాలోవర్లు
Virat Kohli Instagram followers: ఇండియన్ క్రికెట్ టీమ్ సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఫాలోవర్ల సంఖ్య 25 కోట్ల మార్క్ అందుకోవడం విశేషం. ఇప్పటి వరకూ ఏ భారతీయుడిగా సాధ్యం కాని రికార్డు ఇది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న అథ్లెట్ల లిస్టులో మూడోస్థానంలో కోహ్లి ఉన్నాడు.
ఫుట్‌బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల తర్వాతి స్థానం కోహ్లిదే. టీమిండియా కెప్టెన్సీ వదులుకున్నా, రెండున్నరేళ్ల పాటు సెంచరీ లేక ఫామ్ కోసం తంటాలు పడినా.. విరాట్ క్రేజ్ మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం. ఇన్‌స్టాగ్రామ్ లో అతని ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. గతేడాది ఆసియా కప్ నుంచి మళ్లీ గాడిలో పడిన కోహ్లి సెంచరీల మోత మోగిస్తున్నాడు.
తాజాగా ఐపీఎల్లోనూ ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరలేకపోయినా.. కోహ్లి మాత్రం రెండు సెంచరీలు బాదాడు. ఈ ఏడాది 14 మ్యాచ్ లలో ఏకంగా 53.25 సగటుతో 639 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇండియన్ క్రికెట్ లో సచిన్, ధోనీ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం ఆ ఇద్దరినీ మించిపోయాడు.
అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న ఇండియన్స్ లిస్టులో కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. విరాట్ కోహ్లి తర్వాత ప్రియాంకా చోప్రా సుమారు 9 కోట్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో ఉంది. ఆ తర్వాత శ్రద్ధాకపూర్ (8 కోట్లు), ఆలియా భట్ (7.7 కోట్లు), నరేంద్ర మోదీ (7.5 కోట్లు), నేహా కక్కర్ (7.4 కోట్లు), దీపికా పదుకోన్ (7.4 కోట్లు), కత్రినా కైఫ్ (7.2 కోట్లు), జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (6.6 కోట్లు), ఊర్వశి రౌతేలా (6.4 కోట్లు) ఉన్నారు.