Gavaskar on virat kohli: టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లి భవిష్యత్తు ఏంటి? వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో కోహ్లి ఉంటాడా లేదా? కొంతకాలంగా జరుగుతున్న ఈ చర్చకు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పష్టమైన సమాధానమిచ్చాడు. అతని అభిప్రాయం ప్రకారం.. విరాట్ ఇప్పుడున్న ఫామ్ ప్రకారం కచ్చితంగా టీ20 క్రికెట్ లో ఉండాలి.
ఇక వచ్చే ఏడాది వరల్డ్ కప్ టీమ్ లో ఉండాలా లేదా అన్నది 2024 ఐపీఎల్లో అతడు ఎలా ఆడతాడన్నదానిపై ఆధారపడి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియా ఓడిపోయిన తర్వాత టీ20 టీమ్ పూర్తి ప్రక్షాళన అవసరం అని, విరాట్, రోహిత్ లాంటి సీనియర్లను ఈ ఫార్మాట్ నుంచి పక్కన పెట్టాల్సిన టైమ్ వచ్చేసిందన్న వాదనలు వినిపించాయి.
అయితే కోహ్లి మాత్రం తనలో టీ20 ఫార్మాట్ ఆడే సత్తా ఉందని తాజా ఐపీఎల్ తో నిరూపించాడు. మొదట్లో స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చినా.. తర్వాత రెండు వరుస సెంచరీలతో విమర్శకుల నోళ్లు మూయించాడు. అందుకే ప్రస్తుత ఫామ్ ఆధారంగా అయితే తాను కచ్చితంగా టీ20 టీమ్ లో కోహ్లికి అవకాశం కల్పిస్తానని గవాస్కర్ చెప్పాడు.
"తర్వాతి టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడనున్నారు. దానికి ముందు వచ్చే ఏడాది మార్చి,ఏప్రిల్ లో మరో ఐపీఎల్ జరుగుతుంది. ఆ సమయంలో కోహ్లి ఫామ్ పరిగణనలోకి తీసుకోవాలి. దాని గురించి ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు. త్వరలో జరగబోయే అంటే జూన్ లో ఒకవేళ టీ20 సిరీస్ జరగనుందంటే మాత్రం కచ్చితంగా అతడు జట్టులో ఉండాల్సిందే.
అలాంటి ఫామ్ లో కోహ్లి ఉన్నాడు. కానీ వెస్టిండీస్, అమెరికాలలో జరగబోయే 2024 టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడితే మాత్రం.. వచ్చే ఐపీఎల్లో ప్లేయర్స్ ఫామ్ చూడాలి. అప్పుడే వరల్డ్ టీమ్ ఎంపికపై మాట్లాడుకోవచ్చు" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ 14 మ్యాచ్ లలో 639 పరుగులు చేశాడు. అతని సగటు 53.25 కాగా.. స్ట్రైక్ రేట్ 139.82. అందులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. "నా టీ20 ఇంటర్నేషనల్ టీమ్ లో కచ్చితంగా విరాట్ ఉంటాడు.
అతడు రెండు సెంచరీలు చేశాడు. 50 కొట్టడం కూడా కష్టమయ్యే ఫార్మాట్ లో రెండు సెంచరీలు చేయడం మామూలు విషయం కాదు. ఒకవేళ నేను సెలక్టర్ అయితే, ఇండియా జూన్ లో టీ20 సిరీస్ ఆడేది ఉంటే కచ్చితంగా విరాట్ ను టీమ్ లోకి తీసుకుంటాను" అని గవాస్కర్ అన్నాడు.
సంబంధిత కథనం