Ravi Shastri on Kohli: టీ20ల నుంచి మీకు మీరుగా తప్పుకోండి లేదంటే.. కోహ్లి, రోహిత్‌లకు రవిశాస్త్రి అల్టిమేటం-ravi shastri on kohli and rohit says they should rule themselves out of t20
Telugu News  /  Sports  /  Ravi Shastri On Kohli And Rohit Says They Should Rule Themselves Out Of T20
రోహిత్, కోహ్లిలకు అల్టిమేటం జారీ చేసిన రవిశాస్త్రి
రోహిత్, కోహ్లిలకు అల్టిమేటం జారీ చేసిన రవిశాస్త్రి (ANI)

Ravi Shastri on Kohli: టీ20ల నుంచి మీకు మీరుగా తప్పుకోండి లేదంటే.. కోహ్లి, రోహిత్‌లకు రవిశాస్త్రి అల్టిమేటం

15 May 2023, 15:32 ISTHari Prasad S
15 May 2023, 15:32 IST

Ravi Shastri on Kohli: టీ20ల నుంచి మీకు మీరుగా తప్పుకోండి లేదంటే అంటూ కోహ్లి, రోహిత్‌లకు రవిశాస్త్రి అల్టిమేటం జారీ చేశాడు. ఒకప్పుడు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి ప్లేయర్స్ పరిస్థితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఎదుర్కొంటున్నట్లు అతడు అభిప్రాయపడ్డాడు.

Ravi Shastri on Kohli: ఎంతటి ప్లేయర్ అయినా ఓ స్థాయికి వచ్చిన తర్వాత తనకు తానుగా తప్పుకుంటేనే గౌరవం. ప్రస్తుతం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ఇద్దరూ దశాబ్దకాలంగా ఇండియన్ క్రికెట్ ను భుజాన మోస్తున్నా ప్రస్తుతం వాళ్లు టీ20 క్రికెట్ కు భారంగా మారే పరిస్థితి వచ్చేసింది. ఓవైపు యువకులు చెలరేగుతున్న వేళ.. ఈ ఇద్దరూ వాళ్ల స్పీడును అందుకోలేక విమర్శల పాలవుతున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి.. విరాట్, రోహిత్ లకు అల్టిమేటం జారీ చేశాడు. తమకు తాముగా టీ20ల నుంచి తప్పుకుంటే మంచిదని అతడు అనడం గమనార్హం. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం యువకుల వైపు చూడాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశాడు. అంతేకాదు ఒకప్పుడు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి ప్లేయర్స్ పరిస్థితినే ఈ ఇద్దరూ ఎదుర్కొంటున్నట్లు శాస్త్రి అనడం విశేషం.

"సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్ లు ఒకప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే విరాట్, రోహిత్ ఉన్నారు. అందుకే వాళ్ల ముందు ఉన్నది ఒక్కటే దారి. టీ20ల నుంచి విరాట్, రోహిత్ తమకు తాముగాతప్పుకోవాలి. లేదంటే ఫామ్ చూడాల్సి వస్తుంది. ఏడాది సుదీర్ఘ సమయమే. ఆ సమయానికి బెస్ట్ ప్లేయర్స్ ను ఎంపిక చేస్తారు. అప్పుడు అనుభవంతోపాటు ఫిట్‌నెస్ కూడా చూడాల్సి వస్తుంది" అని క్రికిన్ఫోతో మాట్లాడుతూ శాస్త్రి అన్నాడు.

టీ20లను యువకులకు వదిలేసి కోహ్లి, రోహిత్ టెస్టులు, వన్డేలవైపు చూడాలనీ రవిశాస్త్రి చెప్పాడు. వచ్చే నెలలో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆ తర్వాత ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లలో వన్డే వరల్డ్ కూడా జరగనుంది. "విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తామేంటో ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇక ఇప్పుడు యువకులకు అవకాశం ఇవ్వాలి. రోహిత్, కోహ్లి వన్డే, టెస్టు క్రికెట్ వైపు చూడాలి" అని శాస్త్రి సూచించాడు.

సంబంధిత కథనం