టీ20 క్రికెట్‌కు వందేళ్ల చరిత్ర.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
సహజంగానే క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లండ్‌లోనే ఈ కొత్త టీ20 క్రికెట్ ఫార్మాట్ కూడా పురుడు పోసుకుంది. ముఖ్యంగా తొలి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత క్రికెట్ ఆడే విధానంలో పెను మార్పులు వచ్చాయి.
క్రికెట్‌లో మీరు ఎక్స్‌పర్టా? ఏమడిగినా చెప్పేస్తారా? అయితే తొలి T20 cricket మ్యాచ్ ఎప్పుడు జరిగిందో చెప్పగలరా? చాలా మందికి తొలి అధికారిక టీ20 మ్యాచ్ గురించి తెలుసు. 2003, జూన్ 13న ఇంగ్లండ్‌లోని కౌంటీ క్లబ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.
ఇక తొలి ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ 2004, ఆగస్ట్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ వుమెన్స్ టీమ్స్ మధ్య జరిగింది. కానీ అసలు ఈ ఫార్మాట్‌కు వందేళ్ల చరిత్ర ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు?
తొలి ప్రపంచ యుద్ధం తర్వాతే..
ముచ్చటగా మూడు గంటల్లో ముగిసిపోయే ఫార్మాట్ ఈ T20 cricket. సుమారు రెండు దశాబ్దాలుగా క్రికెట్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందులోనూ 2007లో జరిగిన తొలి వరల్డ్‌కప్‌ను ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా గెలవడంతో ఈ ఫార్మాట్‌కు ఊహించినదాని కంటే ఎక్కువ క్రేజ్, ఫాలోయింగ్ లభించింది.
అలా సాయంత్రం వేళ ఓ ఈవెనింగ్ షో సినిమాకు వెళ్లి వచ్చినట్లుగా ముగిసిపోతుండటంతో ఈ ఫార్మాట్‌కు యువతలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయితే అసలు ఈ కొత్త కాన్సెప్ట్ ఎప్పుడో వందేళ్ల కిందట, తొలి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రూపుదాల్చిందంటే నమ్మగలరా?
ఎక్కడి నుంచి వచ్చింది?
సహజంగానే క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లండ్‌లోనే ఈ కొత్త టీ20 క్రికెట్ ఫార్మాట్ కూడా పురుడు పోసుకుంది. ముఖ్యంగా తొలి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత క్రికెట్ ఆడే విధానంలో పెను మార్పులు వచ్చాయి.
ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ గ్రామీణ ప్రాంతాల్లో తొలిసారి ఈ 20 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ కనిపించింది. యుద్ధం మిగిల్చిన విషాదం నుంచి తేరుకోవడానికి అక్కడి వాళ్లు ఎంచుకున్న మార్గం ఈ క్రికెటే. యుద్ధం ముగిసిన తర్వాత మరోసారి యార్క్‌షైర్ వ్యాప్తంగా క్రికెట్ క్లబ్స్ వెలిశాయి.
యుద్ధ ఖైదీలుగా ఫ్రాన్స్, ఈజిప్ట్‌లలో గడిపిన వాళ్లను కూడా ఈ క్లబ్స్‌లోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ ఫేమస్ బౌలర్లు స్కోఫీల్డ్ హైగ్, సిడ్నీ బార్నెస్‌లాంటి వాళ్లు మళ్లీ క్రికెట్ ఫీల్డ్‌లో అడుగుపెట్టిన రోజులవి.
మళ్లీ క్రికెట్‌కు పునర్‌వైభవం వస్తున్న ఆ రోజుల్లో.. కేవలం సాయంత్రాలు మాత్రమే ఆడే వీలుండేది. బ్రిటిష్ ఇండస్ట్రీ హబ్ అయిన యార్క్‌షైర్‌లోని ఫ్యాక్టరీలలో ఈ ఫేమస్ క్రికెటర్లంతా పని చేసేవారు.
పగటి పూట వెలుతురును ఎక్కువగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఫ్యాక్టరీలు నిరంతరాయంగా నడిచేవి. సాయంత్రం 5 గంటలకు ఫ్యాక్టరీ సమయం ముగిసిన తర్వాత ఈ క్లబ్స్ ఆరున్నర గంటల ప్రాంతంలో క్రికెట్ మొదలుపెట్టేవి. కేవలం రెండు గంటల్లోనే మ్యాచ్ ముగిసిపోవాలి.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ క్లబ్స్ అన్నీ కలిసి 20 ఓవర్ల క్రికెట్‌కు ఊపిరి పోశాయి. డంకన్ స్టోన్ అనే వ్యక్తి 2008లో రిలీజ్ చేసిన క్రికెట్స్ రీజనల్ ఐడెంటీస్ పుస్తకంలో ఈ ఫార్మాట్ గురించి అధ్యయనం చేసినట్లుగా ఉంది.
అప్పటి పత్రికల రిపోర్ట్‌లను నిదర్శనంగా చూపెడుతూ.. 1922లో యార్క్‌షైర్‌లోని మూడు ప్రాంతాల్లోనే ఇలా క్రికెట్ ఆడే 193 వర్క్ క్రికెట్ టీమ్స్ ఉండేవని చెప్పడం విశేషం. 1930నాటికి ఈ వర్క్ క్రికెట్ టీమ్స్ సంఖ్య 262కు చేరింది. వర్క్ క్రికెట్ యార్క్‌షైర్ సమాజంలో ఓ సాయంత్రపు ఆటవిడుపుగా మారిపోయింది.
తొలి టీ20 లీగ్
యార్క్‌షైర్‌లోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే ఫ్యాక్టరీ కార్మికులు ఏర్పాటు చేసుకున్న క్లబ్స్ మధ్య వారంలో రెండు రోజుల్లో సాయంత్రాలు ఈ మ్యాచ్‌లు జరిగేవి. ఇప్పుడు ఐపీఎల్ ఎలా ఎగబడి చూస్తున్నారో.. అప్పట్లో ఈ మ్యాచ్‌లను చూడటానికి కూడా జనం పెద్ద ఎత్తున వచ్చే వాళ్లు.
వర్క్‌షాప్ కాంపిటిషన్స్ పేరుతో ఈ లీగ్స్ జరిగేవి. మొత్తంగా 50 నుంచి 60 లీగ్స్ జరిగేవంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇలా ఒక్కో కాంపిటిషన్‌లో పది ఉంచి 20 క్లబ్స్ ఉండేవి.
ఇప్పటి టీ20 క్రికెట్‌లాగే రూల్స్ ఉండేవి. ఒక్కో టీమ్ 20 ఓవర్లు ఆడుతుంది. నిర్ణీత సమయంలోపు ఆ ఓవర్లలో ఎక్కువ రన్స్ కొట్టిన టీమ్ విజేతగా నిలుస్తుంది. ఇప్పటి ఐపీఎల్ వీకెండ్ మ్యాచ్‌లకు ఎలా అయితే పెద్ద సంఖ్యలో రేటింగ్స్ వస్తున్నాయో అప్పట్లో ఆ రెండు రోజుల్లో జరిగే ఈ కాంపిటిషన్స్‌ను కూడా భారీ సంఖ్యలో జనాలు చూసేవాళ్లు. అప్పట్లోనే రంగురంగుల దుస్తుల్లో ఆడుతున్న ప్లేయర్స్‌తో ఈ ఫార్మాట్ కొత్త అనుభూతిని పంచింది.
క్రమంగా కనుమరుగై..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి దశాబ్దాల్లో క్రమంగా యార్క్‌షైర్, ఆ చుట్టపక్కల కౌంటీల్లో ఈ క్రికెట్ క్లబ్స్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు మూతపడటమే దీనికి కారణం.
పెద్ద పెద్ద పరిశ్రమలు దేశం వదిలి వెళ్లాయి. దీంతో వర్క్ క్రికెట్ సంస్కృతి, వర్క్‌షాప్ కాంపిటిషన్లు కూడా కనుమరుగయ్యాయి. ఆ తర్వాత కూడా కొన్ని దశాబ్దాలు పాటు అక్కడి కొన్ని క్లబ్స్ సాయంత్రాలు ఈ టీ20 క్రికెట్ ఆడేవి. కాకపోతే అంతకుముందు ఉన్న క్రేజ్ ఉండేది కాదు.
ఇక 2003లో మరోసారి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అప్పటి వరకూ ఉన్న బెన్సన్ అండ్ హెడ్జెస్ వన్డే టోర్నీ స్థానంలో ఓ కొత్త రకం కాంపిటిషన్ కోసం చూస్తున్న సమయంలో అప్పటి మార్కెటింగ్ మేనేజర్‌గా ఉన్న స్టువర్ట్ రాబర్ట్‌సన్ ఈ టీ20 ఫార్మాట్‌ను మరోసారి ప్రతిపాదించాడు.
మొదట్లో చాలా మందిని దీనిని వ్యతిరేకించినా.. మెజార్టీ సభ్యుల మద్దతుతో అదే ఏడాది తొలి అధికారిక ట్వంటీ20 కప్ జరిగింది. ఆ తర్వాత ఈ ఫార్మాట్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో, సృష్టిస్తోందో ఈ జనరేషన్‌కు తెలియంది కాదు.
సంబంధిత కథనం