Kohli on 71st century: ఈ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడుస్తున్నానా అనిపించింది: విరాట్ కోహ్లి
Kohli on 71st century: ఈ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడుస్తున్నానా అనిపించింది అంటూ విరాట్ కోహ్లి తన 71వ సెంచరీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్యూమా కంపెనీ లెట్ దేర్ బి స్పోర్ట్ ప్రోగ్రామ్ లో అతడు మాట్లాడాడు.
Kohli on 71st century: విరాట్ కోహ్లి 70 సెంచరీల దగ్గర ఆగిపోయి.. సుమారు రెండున్నరేళ్ల తర్వాత 71వ సెంచరీ కొట్టిన విషయం తెలుసు కదా. గతేడాది ఆసియా కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ పై విరాట్ ఈ సెంచరీ బాదాడు. అయితే తాజాగా ఆ సెంచరీ చేసే ముందు, తరవాత తన ఫీలింగ్స్ గురించి కోహ్లి పంచుకున్నాడు. ప్యూమా షో లెట్ దేర్ బి స్పోర్ట్ లో కోహ్లి మాట్లాడాడు.
ఈ సెంచరీ కోసం రెండేళ్లు ఏడ్చానా అని అనిపించినట్లు మనసులో మాటను బయటపెట్టాడు. అయితే ఆ సెంచరీ టీ20ల్లో వస్తుందని మాత్రం తాను ఊహించలేదని స్పష్టం చేశాడు. ఆ 71వ సెంచరీ తర్వాత ఇప్పటి వరకూ మరో నాలుగు సెంచరీలు బాదాడు. అందులో మూడు వన్డేల్లో కాగా.. మరొకటి టెస్టుల్లో చేశాడు. దీంతో మొత్తంగా కోహ్లి సెంచరీల సంఖ్య 75కు చేరింది.
"నేను సెంచరీ చేయడానికి ముందు బంతికి అనిపించింది.. నేను 94 మీద ఉన్నాను.. ఈసారి సెంచరీ చేస్తాను అనుకున్నాను. తర్వాతి బాల్ కే సిక్స్ కొట్టాను. కానీ ఆ సెంచరీ కొట్టిన వెంటనే.. నేను గట్టిగా నవ్వాను. రెండేళ్ల నుంచి నేను దీనికోసమే ఏడుస్తున్నాను అనిపించింది" అని ఆ ఇంటర్వ్యూలో కోహ్లి చెప్పాడు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.
"ఈ రెండు సెకన్ల కోసం నేను అంతటి బాధను అనుభవించానా? మొత్తానికి ఆ క్షణం వచ్చేసింది. అది ముగిసిపోయింది. తర్వాతి రోజు షరామామూలే. అది ఎప్పటికీ ఉండిపోయేది కాదు. ఈ సెంచరీ కొట్టాను కాబట్టి.. ఇక జీవితాంతం ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోను. అది చాలా సరదాగా అనిపించింది. చాలా నవ్వాను" అని కోహ్లి అన్నాడు.
ఆ సెంచరీ తర్వాత నిజంగా ఏడ్చారా అని ప్రశ్నించినప్పుడు.. "అప్పుడు కాదు కానీ నేను అనుష్కతో మాట్లాడినప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి" అని కోహ్లి వెల్లడించాడు. ఇక సచిన్ 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తే అది తనకు ఓ ఎమోషనల్ మూమెంట్ అవుతుందని చెప్పాడు. వన్డేల్లో ప్రస్తుతం కోహ్లి 46 సెంచరీలతో ఉన్నాడు.
సంబంధిత కథనం