తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Vinesh Phogat Hospitalized: హాస్పిటల్లో చేరిన వినేశ్ ఫోగాట్.. కంటతడి పెట్టిన మహావీర్ ఫోగాట్.. పీటీ ఉషతో మాట్లాడిన మోదీ

Vinesh Phogat Hospitalized: హాస్పిటల్లో చేరిన వినేశ్ ఫోగాట్.. కంటతడి పెట్టిన మహావీర్ ఫోగాట్.. పీటీ ఉషతో మాట్లాడిన మోదీ

Hari Prasad S HT Telugu

07 August 2024, 14:03 IST

google News
    • Vinesh Phogat Hospitalised: ఒలింపిక్స్ లో అనర్హత వేటు తర్వాత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ హాస్పిటల్లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆమె పెదనాన్న మహావీర్ ఫోగాట్ కంటతడి పెట్టగా.. పీఎం మోదీ ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషతో మాట్లాడారు.
హాస్పిటల్లో చేరిన వినేశ్ ఫోగాట్.. కంటతడి పెట్టిన మహావీర్ ఫోగాట్.. పీటీ ఉషతో మాట్లాడిన మోదీ
హాస్పిటల్లో చేరిన వినేశ్ ఫోగాట్.. కంటతడి పెట్టిన మహావీర్ ఫోగాట్.. పీటీ ఉషతో మాట్లాడిన మోదీ (EPA-EFE)

హాస్పిటల్లో చేరిన వినేశ్ ఫోగాట్.. కంటతడి పెట్టిన మహావీర్ ఫోగాట్.. పీటీ ఉషతో మాట్లాడిన మోదీ

Vinesh Phogat Hospitalised: పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ ఖాయం చేసిందనుకున్న రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన సంగతి తెలుసు కదా. ఆ వెంటనే ఆమెను హాస్పిటల్లో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. డీహైడ్రేషన్ కారణంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలిసింది. బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఆమెకు ఈ పరిస్థితి ఎదురైంది.

వినేశ్‌కు చికిత్స

రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టిస్తుందని అనుకుంటే.. సరిగ్గా చారిత్రక బౌట్ కు కొన్ని గంటల ముందు ఆమె అనర్హతకు గురి కావడం ప్రతి భారతీయుడి గుండె పగిలేలా చేసింది. అయితే రాత్రికి రాత్రి తాను పెరిగిన బరువు తగ్గడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. తిండి మానేసి, స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటివి చేయడంతోపాటు జుట్టు కత్తిరించుకోవడం, రక్తం బయటకు తీయడంలాంటి తీవ్రమైన చర్యలకు కూడా పాల్పడింది.

అయినా చివరికి 150 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. అయితే ఇవన్నీ చేయడంతో డీహైడ్రేషన్ కు గురైంది. ఆమె అక్కడే కళ్లు తిరిగి పడిపోవడంతో ఒలింపిక్స్ విలేజ్ లోనే వినేశ్ కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బాగానే కోలుకుంటుందని, విశ్రాంతి తీసుకుంటుందని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఒలింపిక్స్ లో ఇలా ఫైనల్ కు ముందు అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన తొలి రెజ్లర్ గా వినేశ్ నిలిచింది.

పీటీ ఉషతో మాట్లాడిన పీఎం మోదీ

వినేశ్ ఫోగాట్ అనర్హతపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పీఎం నరేంద్ర మోదీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో మాట్లాడారు. ఈ అంశంపై ఏం చేయగలమన్నదానిపై ఆయన చర్చించారు. అనర్హతపై ఫిర్యాదు చేయాల్సిందిగా ఆమెకు సూచించారు. అంతేకాదు ఆ తర్వాత మోదీ ఓ ట్వీట్ కూడా చేశారు. అందులో వినేశ్ ను ఛాంపియన్లకు ఛాంపియన్ అని అభివర్ణించారు.

"వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. ఇండియాకు గర్వకారణం. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి. ఇవాళ్టి ఎదురుదెబ్బ బాధిస్తోంది. దీనిని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. కానీ దీని నుంచి నువ్వు కోలుకుంటువాన్న నమ్మకం నాకుంది. ఇలాంటి సవాళ్లను నువ్వు ముందు నుంచీ ధైర్యంగా స్వీకరించావు. బలంగా తిరిగా రా.. నీ వెనుక మేమందరం ఉన్నాం" అని మోదీ ట్వీట్ చేశారు.

మహావీర్ ఫోగాట్ కంటతడి

వినేశ్ ఫోగాట్ అనర్హత తర్వాత మీడియాతో మాట్లాడిన లెజెండరీ రెజ్లర్, ఆమె పెదనాన్న, కోచ్ మహావీర్ ఫోగాట్ కంటతడి పెట్టాడు. దీనిపై తాను ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని అన్నాడు. నిజానికి 50, 100 గ్రాములు ఎక్కువున్నా తలపడటానికి అనుమతి ఇస్తారని, కానీ వినేశ్ విషయంలో ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదని చెప్పాడు.

మొత్తం దేశమంతా గోల్డ్ తెస్తుందని భావించిందని, ఉదయమే ఎంతో సంతోషంగా నిద్ర లేస్తే ఈ విషయం షాకింగ్ లా అనిపించిందని తెలిపాడు. అయితే ఇంతటితో అయిపోలేదని మళ్లీ మొదటి నుంచీ ప్రయత్నిస్తామని, ఆమెను మరోసారి తాను మెడల్ కోసం సిద్ధం చేస్తానని మహావీర్ చెప్పడం గమనార్హం. మహావీర్ ఫోగాట్ తమ్ముడు రాజ్‌పాల్ ఫోగాట్ కూతురే ఈ వినేశ్ ఫోగాట్. చిన్నతనం నుంచే ఆమెకు మహావీర్ కోచింగ్ ఇచ్చాడు.

తదుపరి వ్యాసం