Vinesh Phogat Heartbreak: అసలు వినేశ్ ఫోగాట్ బరువు ఎలా పెరిగింది? ఒలింపిక్స్ నిబంధనలు చెబుతున్నది ఇదీ..
Vinesh Phogat Heartbreak: వినేశ్ ఫోగాట్ అసలు బరువు ఎలా పెరిగింది? ఈ రెజ్లర్ల బరువు విషయంలో ఒలింపిక్స్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? వినేశ్ తోపాటు ఇండియా మొత్తం గుండె పగలడానికి కారణమైన ఆ బరువు మనకు మెడల్ ను దూరం చేసింది.
Vinesh Phogat Heartbreak: ఇండియా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ 50 కేజీల ఫ్రీస్టైల్ ఫైనల్ బౌట్ లో పాల్గొనకుండా ఒలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేసిన సంగతి తెలుసు కదా. దీనికంతటికీ కారణం ఆమె కాస్త బరువు ఎక్కువగా ఉండటమే. మరి ఒక్క రోజులోనే వినేశ్ బరువులో తేడా ఎందుకు వచ్చింది? అసలు ఈ విషయంలో ఒలింపిక్స్ నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
వినేశ్ బరువు ఎందుకు పెరిగింది?
వినేశ్ ఫోగాట్ మంగళవారమే (ఆగస్ట్ 6) పారిస్ ఒలింపిక్స్ లో తన జర్నీ మొదలు పెట్టింది. ప్రిలిమినరీ రౌండ్ తోపాటు క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ బౌట్లు ఆమె ఒకే రోజు తలపడింది. వీటికి ముందు ఉదయం ఆమె బరువు చెక్ చేశారు. నిబంధనల ప్రకారం ఆమె 50 కేజీల పరిమితిలోనే ఉంది. అయితే బుధవారం (ఆగస్ట్ 7) ఫైనల్ జరగాల్సిన రోజు ఉదయం మాత్రం ఆమె బరువు కంటే 150 గ్రాములు ఎక్కువగా ఉండటం గమనార్హం.
నిజానికి మంగళవారం రాత్రికి ఆమె 2 కేజీల బరువు పెరిగిందట. దీనికి ప్రధాన కారణం ఒకే రోజు మూడు బౌట్లు తలపడాల్సి రావడం. ఎలాంటి రెజ్లర్ కైనా ఇది సవాలే. ముగ్గురు ప్రపంచస్థాయి రెజ్లర్లతో తలపడటానికి తమ శక్తిని ఆమె కాపాడుకోవాలి. దీనికోసం కచ్చితంగా కొన్ని సప్లిమెంట్లు, పెద్ద మొత్తంలో ఎలక్ట్రోలైట్లు తీసుకొని ఉంటుంది. దీంతో బరువు పెరిగి చివరికి ఇలా మెడల్ లేకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
వినేశ్ ఫోగాట్ బుధవారం 50 కేజీల ఫ్రీస్టైల్ ఫైనల్ బౌట్ లో తలపడాల్సి ఉంది. అయితే తన 50 కేజీల కంటే 150 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో అసలు ఒలింపిక్స్ నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
- ఏ రెజ్లర్ అయినా బౌట్ లో తలపడే రోజు ఉదయం బరువు చెక్ చేస్తారు
- ఒలింపిక్స్ లో ఒక్కో బరువు కేటగిరీలో రెండు రోజుల పాటు పోటీ జరుగుతుంది. అందువల్ల తొలి రోజుతోపాటు ఫైనల్ చేరిన, రెపిచేజ్ తో వచ్చిన రెజ్లర్లు రెండో రోజు కూడా బరువు చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.
- తొలిరోజు బరువు చెక్ చేసే సమయంలో రెజ్లర్లకు 30 నిమిషాల సమయం ఇస్తారు
- ఆ సమయంలో రెజ్లర్లు ఎన్నిసార్లయినా తమ బరువు చెక్ చేసుకునే హక్కు ఉంటుంది
- రెజ్లింగ్ సమయంలో వాళ్లు వేసుకునే దుస్తులు తప్ప ఒంటిపై మరేమీ ఉండవు.
- బరువుతోపాటు వాళ్లకు ఎలాంటి అంటు వ్యాధులుగానీ, గోర్లు కానీ ఉండకూడదు.
- రెండో రోజు మరోసారి బరువు చూసుకోవాల్సిన రెజ్లర్లకు 15 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు
దురదృష్టవశాత్తూ వినేశ్ ఈ సమయంలోనే అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. నిజానికి 50 కేజీల కేటగిరీ ఆమెది కాదు. గత ఒలింపిక్స్ లో 53కేజీల విభాగంలో తలపడింది. కానీ ఈసారి ఆ కేటగిరీలో అంతిమ్ పంగాల్ అర్హత సాధించడంతో వినేశ్ తన బరువును 53 నుంచి 50 కేజీలకు తగ్గించుకొని తలపడింది. రెండో రోజు కూడా తన బరువు తగ్గించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా ఆమెతోపాటు కోట్లాది మంది అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.