Vinesh Phogat Disqualified: వినేశ్ ఫోగాట్‌కు షాక్.. ఆమెపై అనర్హత వేటు.. ఎలాంటి మెడల్ లేకుండానే ఇంటికి.. ఇదీ కారణం
Vinesh Phogat Disqualified: పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ ఖాయం చేసుకుందనుకున్న వినేశ్ ఫోగాట్ కు పెద్ద షాకే తగిలింది. ఆమెను ఫైనల్ బౌట్ తలపడకుండా అనర్హత వేటు వేశారు నిర్వాహకులు.
Vinesh Phogat Disqualified: ఇది రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కే కాదు.. మొత్తం దేశానికే ఓ షాక్ కలిగించే వార్త. 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ చేరి పారిస్ ఒలింపిక్స్ లో పతకం ఖాయం చేసుకున్న వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు వేశారు నిర్వాహకులు. ఫైనల్లో ఆమె ఇక తలపడదు. అంతేకాదు ఎలాంటి మెడల్ లేకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.
వినేశ్‌పై అనర్హత.. ఇదీ కారణం
రెజ్లర్ వినేశ్ ఫోగాట్ బుధవారం (ఆగస్ట్ 7) ఉదయం తాను ఉండాల్సిన 50 కేజీల కంటే కొన్ని గ్రాములు బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఫైనల్ బౌట్ లో తలపడకుండా అనర్హత వేటు వేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఇది నిజంగా వినేశ్ కే కాదు.. ఆమె గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టిస్తుందని ఎదురు చూసిన కోట్లాది మంది భారతీయులకు మింగుడు పడనిదే.
మంగళవారం (ఆగస్ట్ 6) సెమీఫైనల్లో గెలిచి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన తొలి ఇండియన్ మహిళా రెజ్లర్ గా రికార్డు క్రియేట్ చేసిన వినేశ్.. బుధవారం (ఆగస్ట్ 7) ఫైనల్లో తలపడాల్సి ఉంది. ఓడినా కనీసం రజతం అయితే ఖాయం.. గెలిస్తే కొత్త చరిత్రే అని ఆమెతోపాటు కోట్లాది మంది అభిమానులు ఈ బౌట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఊహించని షాక్ తగిలింది.
“మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగం నుంచి వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు వేసినట్లు చెప్పడానికి ఇండియన్ టీమ్ ఎంతగానో చింతిస్తోంది. టీమ్ రాత్రంతా ఎంతగానో ప్రయత్నించినా.. ఉదయమే ఆమె 50 కేజీల కంటే కొన్ని గ్రాముల బరువు అధికంగా తూగింది. ఈ సమయంలో వినేశ్ ప్రైవసీని గౌరవించాలని మేము కోరుతున్నాం” అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అసలేం జరిగింది?
ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం.. ప్రతి రెజ్లర్ ప్రిలిమినరీ రౌండ్, ఫైనల్ బౌట్లు జరిగే రోజుల్లో ఉదయమే తమ బరువు చూపించాల్సి ఉంటుంది. మంగళవారం ఆమె బరువు 50 కేజీలే ఉంది. ఒకే రోజు మూడు బౌట్ల తర్వాత వినేశ్ బరువు పెరుగుతూ వెళ్లింది. రాత్రికి ఆమె బరువు రెండు కేజీలు ఎక్కువగా ఉన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. తన బరువు తగ్గించుకోవడానికి ఆమె రాత్రంతా నిద్ర పోలేదని, సాధ్యమైనంత వరకు జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్.. ఇలా అన్ని విధాలా ప్రయత్నించిందని ఆ రిపోర్టు తెలిపింది.
స్పోర్ట్స్‌స్టార్ లో వచ్చిన రిపోర్టు ప్రకారం.. బరువు తగ్గడానికి ఆమె మరీ తీవ్రమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. జుట్టు కత్తిరించుకోవడం, రక్తం బయటకు తీయడంలాంటివి కూడా చేసిందట. అయినా ఉదయం చూస్తే 50 కేజీల కంటే 150 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
మెడల్ లేనట్లే..
వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు పడటంతో మెడల్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. తొలిసారి ఓ ఒలింపిక్ మెడల్ అది కూడా స్వర్ణంపై గురి పెట్టిన సమయంలో ఇలా జరగడంతో వినేశ్ తోపాటు దేశమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వినేశ్ పై అనర్హతతో ఆమె ప్రత్యర్థి హిల్డర్‌బ్రాండ్ కు గోల్డ్, మరో ఇద్దరికి బ్రాంజ్ మెడల్స్ దక్కనున్నాయి.