Vinesh Phogat: ఒలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకున్న వినేశ్ ఫొగాట్.. ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన భారత రెజ్లర్
Vinesh Phogat - Paris Olympics 2024: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకం ఖాయం చేసుకున్నారు. సెమీస్‍లో ఏకపక్ష విజయం సాధించారు. ఫైనల్‍లో అడుగుపెట్టారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ దుమ్మురేపారు. అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టారు. పారిస్ క్రీడల్లో పతకం ఖాయం చేసుకున్నారు. ఫైనల్ చేరి కొత్త చరిత్ర సృష్టించారు. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‍లో నేడు (ఆగస్టు 8) జరిగిన సెమీఫైనల్‍లో వినేశ్ ఫొగాట్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన యుస్నేలిస్ గజ్‍మన్‍పై ఏకపక్ష విజయం సాధించారు. అద్భుత పట్లు పట్టి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు వినేశ్. ప్రీక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్‍లో అద్భుతం చేసిన వినేశ్.. సెమీస్‍లో మరింత జోరు చూపి సత్తాచాటారు. ఫైనల్‍లో అడుగుపెట్టారు. పారిస్ క్రీడల్లో పతకాన్ని ఖాయం చేసుకున్నారు. గోల్డ్ మెడల్ పట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు.
చరిత్ర సృష్టించిన వినేశ్
పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‍లో ఫైనల్ చేరిన వినేశ్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ చరిత్రలో రెజ్లింగ్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ హిస్టరీ క్రియేట్ చేశారు. అద్భుత ఘనత సాధించడంతో పాటు పతకాన్ని పక్కా చేసుకున్నారు.
నంబర్ వన్ రెజ్లర్‌ను ఓడించి..
ప్రీ-క్వార్టర్స్‌లో నేడు జపాన్‍కు చెందిన ప్రపంచ నంబర్ వన్ సీడ్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ యూ సుసాకితో వినేశ్ ఫొగాట్ తలపడ్డారు. కఠినమైన ప్రత్యర్థి ఎదురైనా వినేశ్ అదరగొట్టారు. తన మార్క్ పట్లను పట్టి ఆత్మవిశ్వాసం చూపారు. అద్భుతమైన ఆట తీరుతో మెప్పించారు. ఓ దశలో వెనుకబడ్డారు. అయితే, బౌట్ ఆఖరి క్షణాల్లో వినేశ్ అదరగొట్టారు. వరుసగా పట్లు పట్టి పాయింట్లు సాధించారు. 3-2 తేడాతో ప్రపంచ చాంపియన్ సుసాకీని వినేశ్ ఫొగాట్ ఓడించారు. అంతర్జాతీయ స్థాయిలో సుసాకీపై గెలిచిన తొలి రెజ్లర్ ఫొగాటే. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్‍లో అడుగుపెట్టారు.
క్వార్టర్ ఫైనల్‍లో ఉక్రెయిన్‍ను చెందిన ఒసాకా లివాచ్‍పై 7-5తో గెలిచారు వినేశ్ ఫొగాట్. ఆ తర్వాత సెమీఫైనల్‍లో క్యూబా రెజ్లర్ జగ్‍మన్‍ను 5-0తో వినేశ్ ఫొగాట్ అలవోకగా మట్టికరిపించారు. ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. స్వర్ణ పతకానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు.
ఫైనల్ ఎప్పుడంటే..
మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఫైనల్‍లో అమెరికా రెజ్లర్ అన్ సారా హిల్‍డెబ్రాంట్‍తో వినేశ్ ఫొగాట్ తలపడనున్నారు. ఈ బౌట్ గెలిస్తే స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంటారు. ఒకవేళ ఓడిపోతే రజత పతకం దక్కుతుంది. భారత కాలమానం ప్రకారం రేపు (ఆగస్టు 7) రాత్రి 11.23 గంటలకు ఈ ఫైనల్ జరగనుంది.
నిరనసలో గళమెత్తి..
రెజ్లర్ వినేశ్ ఫొగాట్ గతేడాది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‍ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలంటూ భారీ స్థాయిలో ఆందోళనలు చేశారు. వినేశ్‍తో పాటు స్టార్ రెజర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ సహా మరికొందరు దేశ రాజధానిలో రోజుల పాటు నిరసనలు చేశారు. గళమెత్తారు. అంతటి కష్టాలను ఎదుర్కొన్న వినేశ్.. మళ్లీ పట్టుదలతో ప్రాక్టీస్ చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి.. పతకం ఖాయం చేసుకున్నారు. ఫైనల్ చేరి చరిత్ర సృష్టించారు. స్వర్ణ పతకం సాధించే అవకాశాన్ని దక్కించుకున్నారు.