Usman Khawaja: అప్పుడు డ్రింక్స్ మోశాడు.. ఇప్పుడు సెంచరీ బాదాడు.. ఖవాజా సూపర్
09 March 2023, 20:11 IST
- Usman Khawaja: అప్పుడు డ్రింక్స్ మోశాడు.. ఇప్పుడు సెంచరీ బాదాడు.. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. సెంచరీ తర్వాత ఎమోషనల్ అయ్యాడు.
ఉస్మాన్ ఖవాజా
Usman Khawaja: నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇండియా వచ్చిన ఆస్ట్రేలియా టీమ్ తరఫున తొలి సెంచరీ నమోదైంది. మొదటి మూడు టెస్టులతో పోలిస్తే కాస్త బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న అహ్మదాబాద్ పిచ్ పై ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతనికిది 14వ సెంచరీ కాగా.. ఇండియాపై ఇదే మొదటిది.
ఖవాజా సెంచరీతో నాలుగో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 255 రన్స్ చేసింది. అటు మిగతా ఆస్ట్రేలియా బ్యాటర్లు హెడ్ (32), స్మిత్ (38), గ్రీన్ (49 నాటౌట్) కూడా రాణించారు. మూడో టెస్ట్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో నాలుగో టెస్టు బరిలో దిగిన ఆస్ట్రేలియా.. అందుకు తగినట్లే మ్యాచ్ ను ఘనంగా ప్రారంభించింది.
ముఖ్యంగా ఖవాజా ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన అతడు.. కాస్త ఎమోషనల్ అయ్యాడు. నిజానికి గతంలో రెండుసార్లు ఇండియా టూర్ కు వచ్చినా ఖవాజాకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. అప్పుడు ఆడిన అన్ని టెస్టుల్లోనూ తాను డ్రింక్స్ మోసినట్లు ఈ సందర్భంగా అతడు గుర్తు చేసుకున్నాడు.
"ఈసెంచరీలో చాలా ఎమోషన్ ఉంది. దీని కంటే ముందు ఇండియాకు రెండుసార్లు వచ్చాను. మొత్తం 8 టెస్టుల్లోనూ డ్రింక్స్ మోశాను. ఈ వికెట్ చాలా బాగుంది. నా వికెట్ పారేసుకోకూడదని అనుకున్నాను. ఇది మానసిక యుద్ధం. మన అహాన్ని పక్కన పెట్టాలి. నాకు ఎలాంటి మూఢ నమ్మకాలు లేవు. కేవలం ఆడుతూ వెళ్లడమే" అని ఖవాజా చెప్పాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఖవాజా 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అటు గ్రీన్ కూడా 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఐదో వికెట్ కు 85 పరుగులు జోడించారు. దీంతో తొలి రోజును ఆస్ట్రేలియా పూర్తిగా డామినేట్ చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెవాల్సిన పరిస్థితుల్లో ఉన్న టీమిండియా తొలి రోజే ఒత్తిడిలో పడింది.