Mark Waugh on Ahmedabad pitch: మా ఆస్ట్రేలియాలో ఇలా ఉండదు.. అహ్మదాబాద్ పిచ్‌పై మార్క్ వా
Mark Waugh on Ahmedabad pitch: మా ఆస్ట్రేలియాలో ఇలా ఉండదు అంటూ అహ్మదాబాద్ పిచ్‌పై మార్క్ వా విమర్శలు గుప్పించాడు. చివరి నిమిషం వరకూ ఏ పిచ్ పై ఆడాలో నిర్ణయించని క్యూరేటర్లపై మండిపడ్డాడు.
Mark Waugh on Ahmedabad pitch: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైనప్ప నుంచీ చర్చంతా పిచ్ ల చుట్టే తిరుగుతున్న విషయం తెలుసు కదా. నిజానికి తొలి మూడు టెస్టుల్లో పిచ్ లు పూర్తిగా స్పిన్ కు అనుకూలించి మూడు రోజుల్లోపే ముగిశాయి. కానీ అహ్మదాబాద్ పిచ్ మాత్రం బ్యాటింగ్ కు అనుకూలిస్తోంది. అయినా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా మాత్రం ఈ పిచ్ పైనా మండిపడుతున్నాడు. అంతేకాదు ఏ పిచ్ పై ఆడాలో చివరి వరకూ నిర్ణయించని క్యూరేటర్లపైనా అసహనం వ్యక్తం చేశాడు.
నిజానికి ఈ మ్యాచ్ కోసం రెండు పిచ్ లు సిద్ధం చేశారు. అయితే తొలి మూడు మ్యాచ్ లలాగా కాకుండా ఈ పిచ్ లపై పచ్చిక కనిపించింది. మ్యాచ్ కు ముందు రోజు అంటే బుధవారం (మార్చి 8) సాయంత్రానికిగానీ ఏ పిచ్ పై ఆడాలో చెప్పలేదు. దీనిపై ఆస్ట్రేలియా స్టాండిన్ కెప్టెన్ స్మిత్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మార్క్ వా మండిపడ్డాడు.
"ఇది సరి కాదు. ఏ పిచ్ పై ఆడాలో తెలియకపోవడం నమ్మశక్యంగా లేదు. మా ఆస్ట్రేలియాలో అయితే కొన్నినెలల ముందే గ్రౌండ్స్ మెన్, క్యూరేటర్లకు సూచనలు ఇస్తారు. అందుకు తగినట్లు వాళ్లు పిచ్ తయారు చేస్తారు. కానీ ఇండియాలో భిన్నంగా ఉంది" అని మార్క్ వా అన్నాడు.
"కౌంటీ క్రికెట్ లాగా అనిపిస్తోంది. కౌంటీల్లో మ్యాచ్ కోసం మూడు పిచ్ లు తయారు చేస్తారు. ప్రత్యర్థిని బట్టి ఏ పిచ్ పై ఆడాలో నిర్ణయిస్తారు. ఇక్కడ ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ.. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలి" అని మార్క్ వా అభిప్రాయపడ్డాడు. ఇక మరో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ మాట్లాడుతూ.. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన తర్వాత, మూడో టెస్టులో ఓడిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ పై స్పందించాడు.
"గత టెస్ట్ మ్యాచ్ చూస్తే మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తర్వాతి పిచ్ గ్రీన్ వికెట్ అయి ఉండాలని, తమను టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు సిద్ధం చేయాలని అన్నాడు. కానీ ఆస్ట్రేలియా ఇదేమీ పట్టించుకోకుండా ఆ మ్యాచ్ గెలిచింది. ఆస్ట్రేలియా ఓడిపోతుందని ఆ పిచ్ తయారు చేసినట్లు నాకు అనిపించింది. ఆస్ట్రేలియా గెలవగానే భయపడ్డారు. ఇప్పుడు మళ్లీ సాంప్రదాయ ఇండియన్ పిచ్ తయారుచేశారు" అని హడిన్ అన్నాడు.