WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇండియాకు ఛాన్స్ ఉందా లేదా?-wtc final as australia confirms its berth india chances hang in balance ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇండియాకు ఛాన్స్ ఉందా లేదా?

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇండియాకు ఛాన్స్ ఉందా లేదా?

Hari Prasad S HT Telugu
Mar 03, 2023 12:03 PM IST

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తన బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇండియాకు ఛాన్స్ ఉందా లేదా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. మూడో టెస్టులో ఓటమి ఇండియా అవకాశాలను క్లిష్టం చేసింది.

మూడో టెస్టులో ఓటమితో ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం
మూడో టెస్టులో ఓటమితో ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం (AP)

WTC Final: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టులు ముగిశాయి. మూడు మ్యాచ్ లూ మూడు రోజుల్లోనే ముగిశాయి. కాకపోతే మూడో టెస్ట్ ఫలితం పూర్తిగా రివర్సయింది. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఇలా చిత్తు చిత్తుగా ఓడించిన ఇండియన్ టీమ్.. మూడో టెస్టులో తానే బోల్తా పడింది. ప్రత్యర్థికి మరోసారి బిగించాలనుకున్న స్పిన్ ఉచ్చు తన మెడకే బిగుసుకుపోయింది.

ఈ విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాను 2-0తో ఓడించి ఇండియాకు వచ్చిన ఆస్ట్రేలియా.. ఈ నాలుగు టెస్టుల్లో కనీసం ఒక్కటి డ్రా చేసుకున్నా ఫైనల్ చేరిపోయేది. అయితే తొలి రెండు టెస్టుల్లో ఓటమితో ఆస్ట్రేలియా అవకాశాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ మూడో టెస్టులో ఏకంగా గెలిచేసి ఫైనల్ కు చేరింది.

ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందా?

ఈ ఓటమి ఇండియాకు డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చేసింది. ఫైనల్ చేరాలంటే ఇండియా ఈ నాలుగు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కంటే ఎక్కువ ఓడిపోకూడదు. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఆస్ట్రేలియా ఆ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను 2-2తో సమం చేస్తే మాత్రం ఇండియాకు కష్టమే.

అప్పుడు శ్రీలంక, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ పై ఇండియా అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఆ సిరీస్ లో న్యూజిలాండ్ ను శ్రీలంక 2-0తో ఓడిస్తే మాత్రం ఆ టీమ్ ఫైనల్ చేరుతుంది. ఇండియాకు నిరాశ తప్పదు. ఇవన్నీ వద్దనుకుంటే మాత్రం నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై కచ్చితంగా గెలవాల్సిందే. మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పినర్లను ఎదుర్కోలేక బోల్తా పడిన టీమిండియా.. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకుంది.

డబ్ల్యూటీసీ(WTC) టేబుల్ ఇదీ

ఆస్ట్రేలియా 2021-23 డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటి వరకూ 18 టెస్టులు ఆడి 11 విజయాలు సాధించింది. మూడు ఓడిపోగా, 4 డ్రా అయ్యాయి. 68.52 పర్సంటేజ్ పాయింట్లతో ఆ టీమ్ డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్ లో ఉంది. ఇక ఇండియా ఇప్పటి వరకూ 17 టెస్టుల్లో 10 విజయాలు సాధించి, ఐదు ఓడిపోయింది. రెండు డ్రాగా ముగిశాయి.

ఇండియా 60.29 పర్సంటేజ్ పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. చివరి టెస్టులో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరిపోతుంది. మరోవైపు శ్రీలంక పది మ్యాచ్ లలో 5 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాతో మూడోస్థానంలో ఉంది. ఆ టీమ్ ఖాతాలో 53.33 పర్సంటేజ్ పాయింట్లు ఉన్నాయి. ఆ టీమ్ న్యూజిలాండ్ ను 2-0 ఓడిస్తే ఫైనల్ చేరుతుంది. ఆ లెక్కన ఫైనల్లో ఆస్ట్రేలియా టీమ్ ఇండియా లేదా శ్రీలంకలలో ఒకరితో తలపడనుంది.

సంబంధిత కథనం