Dravid on Pitches: పిచ్‌లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్
Dravid on Pitches: పిచ్‌లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు కోచ్ రాహుల్ ద్రవిడ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అసలు ఆట కంటే పిచ్ లపైనే ఎక్కువ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ద్రవిడ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Dravid on Pitches: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ జరిగిన ఇండోర్ పిచ్ కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చిన విషయం తెలుసు కదా. సిరీస్ ప్రారంభం నుంచి పిచ్ లపైనే చర్చ జరుగుతుండగా.. ఇండోర్ పిచ్ మరింత దారుణంగా వ్యవహరించడంతో చాలా విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
ప్రతి మ్యాచ్ కు ముందు పిచ్ లను ప్రత్యేకంగా పరిశీలిస్తున్న ద్రవిడ్.. కెప్టెన్ రోహిత్ లాగే ఈ పిచ్ లపై మరీ అంత ఎక్కువ చర్చ అవసరం లేదని అన్నాడు. ఇండోర్ పిచ్ ను కూడా అతడు వెనకేసుకొచ్చాడు. "నేను దాని గురించి మరీ ఎక్కువగా మాట్లాడను. మ్యాచ్ రిఫరీ తన నిర్ణయం తాను తీసుకుంటాడు.
పిచ్ పై తన అభిప్రాయం చెబుతాడు. దాంతో నేను ఏకీభవించాల్సిన అవసరం లేదు. డబ్ల్యూటీసీ పాయింట్ల నేపథ్యంలో అందరూ ఫలితాలు ఇచ్చే పిచ్ లనే తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు బ్యాలెన్స్ సాధించడం కష్టం. ఇది ఇండియాలోనే కాదు.. అన్ని చోట్లా జరుగుతున్నదే" అని ద్రవిడ్ అన్నాడు.
ఇండోర్ పిచ్ పై అస్థిరమైన బౌన్స్ ఉందని, తొలి రోజు ఐదో బంతి నుంచే అది కనిపించిందని తన రిపోర్ట్ లో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ స్పష్టం చేశాడు. ఈ సిరీస్ మొత్తం లో స్కోరింగ్ నమోదవుతోంది. తొలి టెస్టులో ఇండియా చేసిన 400 అత్యధిక స్కోరు కాగా.. ఆస్ట్రేలియా ఆరుసార్లు బ్యాటింగ్ చేస్తే ఒక్కసారి మాత్రమే 200 మార్క్ దాటింది.
అయితే ఈ పిచ్ లను ద్రవిడ్ వెనకేసుకొచ్చాడు. "ఎప్పుడూ పిచ్ లపై చాలా చర్చ జరుగుతోంది. కానీ పిచ్ రెండు జట్లకూ ఒకటే. కొన్నిసార్లు బౌలర్లకు, కొన్నిసార్లు బ్యాటర్లకు సవాలు విసురుతుంది. పిచ్ లు ఎలా ఉన్నా దానిపై ఆడటం నేర్చుకోవాలి. పరిస్థితులకు తగినట్లు సర్దుబాటు చేసుకోవాలి.
ప్రపంచంలో ప్రతి చోటా ఫలితాలను అందించే పిచ్ లనే తయారు చేస్తున్నారు. ఈ మధ్యే సౌతాఫ్రికాలో మేము అలాంటి పిచ్ లపై ఆడాము" అని ద్రవిడ్ అన్నాడు.
ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మరో 60-70 పరుగులు చేసి ఉంటే గెలిచే వాళ్లమని కూడా ఈ సందర్భంగా ద్రవిడ్ చెప్పాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు కూడా కాస్త ఎక్కువగానే పరుగులు ఇచ్చినట్లు అభిప్రాయపడ్డాడు.
సంబంధిత కథనం