BCCI Likely to Challenge ICC: ఐసీసీ నిర్ణయాన్ని బీసీసీఐ ఛాలెంజ్ చేస్తుందా? ఇండోర్ పిచ్ రేటింగ్‌పై అసంతృప్తి
BCCI Likely to Challenge ICC: ఇటీవల ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు వేదికైన ఇండోర్ పిచ్‌కు ఐసీసీ తక్కువ రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడంతో బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఐసీసీ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
BCCI Likely to Challenge ICC: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించ ఆత్మవిశ్వాసంతో ఉండగా.. మూడో టెస్టులో అనూహ్యంగా పుంజుకున్న ఆసీస్ ఫలితాన్ని 2-1 మార్చింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్ పేలవంగా ఉందంటూ మొదటి రోజు నుంచే విమర్శలు తలెత్తాయి. టెస్టు అనంతరం ఐసీసీ సైతం ఈ పిచ్ పేలవంగా ఉందంటూ తక్కువ రేటింగ్ ఇచ్చింది. కేవలం మూడు డీ మెరిట్ పాయింట్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే ఐసీసీ ఈ విధంగా ఇండోర్ పిచ్‌కు తక్కువ రేటింగ్ ఇవ్వడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆంక్షలపై అప్పీల్ చేసుకోడానికి బీసీసీఐ 14 రోజుల గడువు ఉంది. ఏదైనా వేదిక ఐదు సంవత్సరాల రోలింగ్ వ్యవధిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ డీ మెరిట్ పాయింట్లను పొందినట్లయితే 12 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించకుండా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
ఇండోర్ వేదికగా మూడో టెస్టు అనంతరం మ్యాచ్ రిఫరీ క్రిస్ బోర్డ్ పిచ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.."పిచ్ చాలా పొడిగా ఉంది. బంతికి బ్యాట్‌కు మధ్య సమతూల్యతను అందించలేదు. ప్రారంభం నుంచి స్పిన్నర్లకు అనుకూలించింది. మ్యాచ్‌లోని ఐదో బంతి నుంచే స్పిన్ తిరిగింది. అప్పుడప్పుడు ఎలాంటి సీమ్ కదలికను అందించకుండానే గింగిరాలు తిరిగింది. మ్యాచ్ అంతటా అసమాన బౌన్స్ వచ్చింది." అని క్రిస్ బోర్డ్ అన్నారు.
ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. కరెక్టుగా చెప్పాలంటే కేవలం 7 సెషన్లు మాత్రమే ఇరు వర్గాలు ఆడాయి. తొలి రోజు నుంచి పిచ్‌పై విమర్శలు వచ్చాయి. గణాంకాల ప్రకారం 4.8 డిగ్రీల టర్న్ జరిగింది. దీంతో పిచ్ పేలవంగా ఉన్నట్లు ఐసీసీ డీమెరిట్ పాయింట్లు ఇచ్చింది. దీంతో ఆ నిర్ణయాన్ని బీసీసీఐ ఛాలెంజ్ చేయాలని చూస్తోందట.
గతేడాది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసింది. ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రావల్పిండి పిచ్‌కు ఐసీసీ డీమెరిట్ పాయింట్లు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పిచ్ సగటు కంటే తక్కువ(Below Average) రేటింగ్ ఇచ్చింది. ఫుటేజిని పరిశీలించిన తర్వాత డీ మెరిట్ పాయింట్‌ను రద్దు చేశారు.
సంబంధిత కథనం