Rohit Sharma: పాకిస్థాన్‌లో టెస్టులు బోర్ వస్తున్నాయన్నారు కదా.. మేము ఆసక్తిగా మారుస్తున్నాం: రోహిత్
Rohit Sharma: పాకిస్థాన్‌లో టెస్టులు బోర్ వస్తున్నాయన్నారు కదా.. మేము ఆసక్తిగా మారుస్తున్నాం అని అన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టులూ మూడు రోజుల్లోనే ముగియడంపై అతడీ కామెంట్స్ చేశాడు.
Rohit Sharma: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగిన మూడు టెస్టులూ మూడు రోజుల్లోపే ముగిసిన విషయం తెలుసు కదా. తొలి రెండు టెస్టుల్లో ఇండియా ఇలా గెలవగా.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఎదురు దాడికి దిగి అదే ఫలితాన్ని అందుకుంది. అయితే ఇలా ప్రతి టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు కాకుండా మూడు రోజుల్లోనే ముగియడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
దీనికి పిచ్ లు కారణం కాదు.. బ్యాటర్లకు సామర్థ్యం లేకపోవడమే కారణమని అతడు అనడం గమనార్హం. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసిందని.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసిన విషయాన్ని గుర్తు చేశాడు. నిజానికి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య బ్రిస్బేన్ లో జరిగిన మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది.
ఇక సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య మరో మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. ఇందులో 9 సెషన్లలో కలిపి మొత్తం 40 వికెట్లు నేలకూలగా.. సౌతాఫ్రికా 87 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లతోపాటు పాకిస్థాన్ లో ఐదు రోజుల పాటు టెస్టులు సాగి డ్రాగా ముగిసిన విషయాన్ని కూడా రోహిత్ గుర్తు చేస్తూ.. అక్కడ మ్యాచ్ లను బోర్ అన్నారు కదా వాటిని మేము ఆసక్తిగా మారుస్తున్నాం అని అతడు అన్నాడు.
"దాని గురించి నేనేం చెప్పగలను. ఓ మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగాలంటే ప్లేయర్స్ బాగా ఆడాలి. ఇండియా బయట కూడా మ్యాచ్ లు ఐదు రోజుల పాటు సాగడం లేదు. నిన్న సౌతాఫ్రికాలో మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇది నైపుణ్యాలకు సంబంధించినది.
పరిస్థితులకు తగినట్లు నైపుణ్యాలను సమకూర్చుకోవాలి. పిచ్ లు బౌలర్లకు సాయం చేస్తుంటే.. బ్యాటర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి" అని రోహిత్ స్పష్టం చేశాడు.
"ప్రతిసారి ఫ్లాట్ పిచ్ లపై ఆడుతూ ఫలితం రాకుండా ఉండటం జరగదు. పాకిస్థాన్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లను చూసి చాలా బోరింగ్ గా ఉన్నాయని అంటున్నారు. మీకోసం మేము వాటిని ఆసక్తికరంగా మారుస్తున్నాం" అని రోహిత్ అనడం విశేషం.
సంబంధిత కథనం