Indore Test: అద్భుతాలేమీ లేవు.. సింపుల్‌గా టార్గెట్ చేజ్ చేసేసిన ఆస్ట్రేలియా-indore test australia beat india convincingly with 9 wickets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Indore Test Australia Beat India Convincingly With 9 Wickets

Indore Test: అద్భుతాలేమీ లేవు.. సింపుల్‌గా టార్గెట్ చేజ్ చేసేసిన ఆస్ట్రేలియా

Hari Prasad S HT Telugu
Mar 03, 2023 10:51 AM IST

Indore Test: అద్భుతాలేమీ లేవు.. సింపుల్‌గా టార్గెట్ చేజ్ చేసేసింది ఆస్ట్రేలియా. నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా ఆధిక్యాన్ని ఆస్ట్రేలియా 2-1కి తగ్గించింది. సిరీస్ ఫలితం నాలుగో టెస్టులో తేలనుంది.

ఇండియా బౌలర్లపై ఎదురు దాడికి దిగి ఆస్ట్రేలియాను గెలిపించిన హెడ్
ఇండియా బౌలర్లపై ఎదురు దాడికి దిగి ఆస్ట్రేలియాను గెలిపించిన హెడ్ (AFP)

Indore Test: భారత అభిమానులు ఆశించిన అద్భుతాలు ఇండోర్ లో జరగలేదు. సీన్ పూర్తిగా రివర్సయింది. ఇండియన్ టీమ్ తాను తీసిన గోతిలో తానే పడింది. స్పిన్ ఉచ్చులో చిక్కుకొని, తన స్పిన్ తో కంగారూలను బోల్తా కొట్టించలేక ఇండోర్ టెస్టులో ఓడిపోయింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోయి సులువుగా చేజ్ చేసింది.

తొలి ఓవర్ రెండో బంతికే ఖవాజా (0)ను ఔట్ చేసి అశ్విన్ ఆశలు రేపినా.. తర్వాత ట్రావిస్ హెడ్, లబుషేన్ ఇద్దరూ కలిసి ఇండియా ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరూ ఇండియా బౌలర్లపై ఎదురు దాడికి దిగి మూడో రోజు లంచ్ లోపే మ్యాచ్ ముగించారు. అశ్విన్, జడేజా స్పిన్ ను వీళ్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా.. తర్వాత వరుసగా బౌండరీలు బాదుతూ సులువుగా లక్ష్యాన్ని ఛేదించగలిగారు.

18.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఈ టార్గెట్ చేజ్ చేసింది. హెడ్ 49, లబుషేన్ 28 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ లో ఇండియా ఆధిక్యం 2-1కి తగ్గింది.

ఇండోర్ టెస్టు తొలి రోజే ఇండియా దాదాపు మ్యాచ్ ను ఆస్ట్రేలియా చేతుల్లో పెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. 109 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. తర్వాత ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులకే కట్టడి చేసినా.. ఈ కఠినమైన పిచ్ పై ప్రత్యర్థికి 88 పరుగుల ఆధిక్యం సమర్పించుకుంది.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లోనూ ఇండియన్ బ్యాటర్లు తీరు మారలేదు. పుజారా (59) హాఫ్ సెంచరీ చేయడంతో 163 పరుగులైనా చేయగలిగింది. దీంతో ఆస్ట్రేలియా ముందు కేవలం 76 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంచి బౌలర్లకు పోరాడే అవకాశం కూడా ఇవ్వలేకపోయింది.

ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఇండియా నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించేది. ఇప్పుడీ బెర్త్ కోసం చివరిదైన నాలుగో టెస్టు కోసం వేచి చూడాలి. ఆ మ్యాచ్ లోనూ ఇండియా ఓడితే ఫైనల్ బెర్త్ ఇక శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ పై ఆధారపడి ఉంటుంది. నాలుగో టెస్ట్ గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది. కనీసం డ్రా చేసుకున్నా ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇండియా ఓడితే మాత్రం అటు శ్రీలంక ను న్యూజిలాండ్ 2-0తో ఓడించాల్సి ఉంటుంది. అలాగైతేనే ఇండియాకు ఫైనల్ ఛాన్స్ ఉంటుంది.

WhatsApp channel