Rohit Sharma on Indore Pitch: ఇలాంటి పిచ్‌లపైనే ఆడాలనుకున్నాం.. ఓడిపోతేనే బ్యాటింగ్ వైఫల్యం గుర్తొచ్చిందా: రోహిత్-rohit sharma on indore pitch says these are thd kind of wickets we wanted to play ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma On Indore Pitch: ఇలాంటి పిచ్‌లపైనే ఆడాలనుకున్నాం.. ఓడిపోతేనే బ్యాటింగ్ వైఫల్యం గుర్తొచ్చిందా: రోహిత్

Rohit Sharma on Indore Pitch: ఇలాంటి పిచ్‌లపైనే ఆడాలనుకున్నాం.. ఓడిపోతేనే బ్యాటింగ్ వైఫల్యం గుర్తొచ్చిందా: రోహిత్

Hari Prasad S HT Telugu
Mar 03, 2023 12:29 PM IST

Rohit Sharma on Indore Pitch: ఇలాంటి పిచ్‌లపైనే ఆడాలనుకున్నాం.. ఓడిపోతేనే బ్యాటింగ్ వైఫల్యం గుర్తొచ్చిందా అని ప్రశ్నించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ఓడిపోయిన తర్వాత అతడు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

పిచ్ లపై వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించిన రోహిత్ శర్మ
పిచ్ లపై వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించిన రోహిత్ శర్మ (AP)

Rohit Sharma on Indore Pitch: ఇండోర్ టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా ఇండోర్ పిచ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇలాంటి పిచ్‌లపైనే టీమ్ ఆడాలనుకుందని, ఇప్పుడు ఓడిపోయిన తర్వాతే బ్యాటింగ్ వైఫల్యం గుర్తొచ్చిందా అని అతడు ప్రశ్నించడం గమనార్హం.

ఇలాంటి పిచ్ లపై ఆడాలన్నది జట్టు సమష్టి నిర్ణయమని కూడా అతడు స్పష్టం చేశాడు. గెలిచినప్పుడు బ్యాటింగ్ వైఫల్యాల గురించి ఎవరూ మాట్లాడలేదన్ని విషయాన్ని అతడు గుర్తు చేశాడు. "ఇలాంటి పిచ్ లపై ఆడాలన్నది టీమ్ మొత్తం సమష్టిగా తీసుకున్న నిర్ణయం. బ్యాటర్లపై అదనపు ఒత్తిడి పెట్టదలచుకోలేదు. మేము గెలిచినప్పుడు బ్యాటింగ్ గురించి ఎవరూ మాట్లాడరు. ఓడిపోయినప్పుడే ఇలాంటివి చర్చకు వస్తాయి. ఓ జట్టుగా మేము ఇలాంటి పిచ్ లపైనే ఆడాలని అనుకున్నాం" అని రోహిత్ తేల్చి చెప్పాడు.

ఇండోర్ పిచ్ పై ఆస్ట్రేలియా మాజీల విమర్శలపై రోహిత్ స్పందిస్తూ.. పిచ్ లపై చర్చ ఇక చాలని అన్నాడు. ఇండియాలో వాళ్లు ఆడినప్పుడల్లా చర్చ మొత్తం పిచ్ ల చుట్టే తిరుగుతుందని రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. తొలి రోజు తొలి సెషన్ నుంచే స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై ఆస్ట్రేలియా కంటే ఇండియన్ బ్యాటర్లే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.

"పిచ్ పై చర్చ చాలా ఎక్కువైంది. ఇండియాలో ఆడినప్పుడల్లా పిచ్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎవరూ లయన్ గురించో, ఖవాజా గురించో, రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడిన పుజారా గురించో నన్ను అడగరు. అలాంటివి అడిగితే వివరంగా చెబుతాను" అని రోహిత్ అన్నాడు.

ఇలాంటి పిచ్ లపై ఇండియన్ టీమ్ ఆడాలని అనుకుందని, ఒకవేళ వాటిపై గెలిచి ఉండకపోతే స్పిన్ కు అనుకూలించే పిచ్ లు వద్దని అనుకునేవాళ్లమని రోహిత్ చెప్పాడు. "ఇలాంటి పిచ్ లపైనే ఆడుతూ ఉండాలనుకున్నాం. అదే మన బలం. బయటి వ్యక్తులు ఏమనుకుంటున్నారన్నది మాకు అనవసరం. మేము ఫలితాలు పొందకపోయి ఉంటే అది భిన్నంగా ఉండేది. కానీ మేము గెలుస్తున్నాం. కొందరు బ్యాటర్లు ఒత్తిడిలో ఉన్నారు. అది ఓకే" అని రోహిత్ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం