Indore Pitch: ఇదో చెత్త పిచ్.. ఇండోర్ పిచ్‌పై మాజీ క్రికెటర్ల అసహనం
Indore Pitch: ఇదో చెత్త పిచ్ అంటూ ఇండోర్ పిచ్‌పై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా మాజీలే కాదు.. దిలీప్ వెంగ్‌సర్కార్ లాంటి ఇండియన్ మాజీలు కూడా పిచ్ తీరుపై మండిపడ్డారు.
Indore Pitch: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్ట్ పిచ్ పై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తొలి రోజు తొలి సెషన్ నుంచే స్పిన్ కు అనుకూలిస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ పిచ్ మరీ చెత్తగా ఉందని వాళ్లు అంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ దీనిపై స్పందిస్తూ.. ఇది టెస్ట్ క్రికెట్ ను అవహేళన చేస్తున్నట్లుగా ఉందని అన్నాడు.
"మంచి క్రికెట్ చూడాలనుకుంటే పిచ్ ది కూడా ప్రధానమైన పాత్రే. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లకు అనుకూలించేలా పిచ్ పై సమానమైన బౌన్స్ ఉండాలి. తొలి రోజు తొలి సెషన్ నుంచే బాల్ స్పిన్ అవుతూ, అది కూడా అస్థిరమైన బౌన్స్ ఉంటే.. అది టెస్ట్ క్రికెట్ ను అవహేళన చేయడమే అవుతుంది" అని వెంగ్‌సర్కార్ స్పష్టం చేశాడు.
"టెస్ట్ క్రికెట్ వైపు మళ్లీ అభిమానులను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో అది జరుగుతోంది. కానీ ఇండియాలో మాత్రం జరగడం లేదు. ఆసక్తికరంగా ఉంటేనే అభిమానులు టెస్ట్ క్రికెట్ చూస్తారు. తొలి సెషన్ నుంచే బ్యాటర్లను బౌలర్లు డామినేట్ చేస్తే చూడాలని ఎవరూ కోరుకోరు" అని వెంగ్‌సర్కార్ అన్నాడు.
ఇదో చెత్త పిచ్: ఆస్ట్రేలియా మాజీలు
ఇదో చెత్త పిచ్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. ఏ పిచ్ పై ఆడుతున్నాం అసలు అంటూ అతడు ప్రశ్నించాడు. తొలి రోజే మూడో రోజు పిచ్ లాగా అనిపిస్తోందని, ఇది మరింత దారుణంగా మారుతుందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. అసలు ఈ పిచ్ టెస్ట్ ప్రమాణాలకు అనుగుణంగా లేదని మరో మాజీ క్రికెటర్ మార్క్ వా స్పష్టం చేశాడు.
"గందరగోళంగా ఉంది. ఈ పిచ్ అసలు టెస్ట్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. టెస్ట్ తొలి 20 నిమిషాల్లోనే బాల్ స్పిన్ అయింది. ఇది సరి కాదు" అని మార్క్ వా అన్నాడు. ఈ పిచ్ ఇండియాకు కూడా మేలు చేయదని, కేవలం లక్ ఉంటే మాత్రమే కలిసొస్తుందని అనడం గమనార్హం. ఎంత మంచి బ్యాటర్ అయినా సరే కాస్త లక్ కలిసి వస్తేనే ఈ పిచ్ పై ఆడగలరని అన్నాడు.
సంబంధిత కథనం