Ahmedabad Pitch: అహ్మదాబాద్ పిచ్ పరిస్థితి ఇదీ.. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగుస్తుందా?-ahmedabad pitch may assist spinners as both the previous tests here last for only 3 days ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ahmedabad Pitch: అహ్మదాబాద్ పిచ్ పరిస్థితి ఇదీ.. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగుస్తుందా?

Ahmedabad Pitch: అహ్మదాబాద్ పిచ్ పరిస్థితి ఇదీ.. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగుస్తుందా?

Hari Prasad S HT Telugu
Mar 06, 2023 06:01 PM IST

Ahmedabad Pitch: అహ్మదాబాద్ పిచ్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఇక్కడ కూడా మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగుస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్ లు ఎలా సాగాయో ఒకసారి చూద్దాం.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మూడు రోజుల్లోపే ముగిసిన రెండు టెస్టులు
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మూడు రోజుల్లోపే ముగిసిన రెండు టెస్టులు (PTI)

Ahmedabad Pitch: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టులు జరిగాయి. మూడూ మూడు రోజుల్లోపే ముగిసిపోయాయి. స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై రెండు జట్ల బ్యాటర్లు అంతకంటే ఎక్కువ బ్యాటింగ్ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ లో చివరిదైన నాలుగో టెస్టు గురువారం (మార్చి 9) అహ్మదాబాద్ లో ప్రారంభం కాబోతోంది.

అయితే ఈ మ్యాచ్ కూడా మూడు రోజుల్లోపే ముగిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ స్టేడియంలో జరిగిన రెండు మ్యాచ్ ల ఫలితాలను చూస్తే అదే స్పష్టమవుతోంది. ఈ రెండింట్లోనూ ఇండియానే గెలిచినా.. ఆ మ్యాచ్ లు రెండు, రెండున్నర రోజుల్లోనే ముగియడం గమనార్హం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఈ పిచ్ పై టీమిండియా ఏ చేస్తుందో చూడాలి.

అహ్మదాబాద్ పిచ్.. రెండు రోజుల మ్యాచ్

అహ్మదాబాద్ 2021లో ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండు మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చింది. ఈ రెండింట్లోనూ ఇండియానే గెలిచింది. తొలి మ్యాచ్ అయితే మరీ దారుణంగా రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్ లో 10 వికెట్లతో ఇండియా గెలిచింది. అప్పుడే కొత్తగా కట్టిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ను రెండో ఇన్నింగ్స్ లో కేవలం 81 పరుగులకే కట్టడి చేసిన ఇండియా.. తర్వాత 49 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది.

ఇక ఇంగ్లండ్ తోనే తర్వాతి టెస్టు కూడా అక్కడే జరిగింది. ఈ మ్యాచ్ కూడా రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఇందులో ఇండియా ఏకంగా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 365 రన్స్ చేసి 160 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే ఇంగ్లండ్ మాత్రం రెండు ఇన్నింగ్స్ కలిపి కేవలం 340 రన్స్ చేయగలిగింది.

అయితే ఈ పిచ్ కు అప్పటి ఐసీసీ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ యావరేజ్ రేటింగ్ ఇచ్చాడు. రెండు మ్యాచ్ లలోనూ స్పిన్నర్ అక్షర్ పటేల్ చెలరేగాడు. పూర్తిగా స్పిన్ కు అనుకూలించిన పిచ్ పై ఇంగ్లండ్ నిలవలేకపోయింది.

ఈ పిచ్ పై ఇంగ్లండ్ బ్యాటర్ అయిన జో రూట్ కూడా స్పిన్ బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. స్పిన్ బౌలింగ్ చేస్తే చాలు వికెట్ పడుతుంది అన్నట్లుగా అనిపించింది. ఆ లెక్కన ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు కూడా మూడు రోజుల్లోపే ముగిసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

WhatsApp channel

సంబంధిత కథనం