Gavaskar on Team India: ఇండియా బౌలింగ్ బలంగా లేదు.. అందుకే ఇలాంటి పిచ్‌లు: గవాస్కర్-gavaskar on team india says their bowling attack is weak ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar On Team India: ఇండియా బౌలింగ్ బలంగా లేదు.. అందుకే ఇలాంటి పిచ్‌లు: గవాస్కర్

Gavaskar on Team India: ఇండియా బౌలింగ్ బలంగా లేదు.. అందుకే ఇలాంటి పిచ్‌లు: గవాస్కర్

Hari Prasad S HT Telugu
Mar 06, 2023 02:37 PM IST

Gavaskar on Team India: ఇండియా బౌలింగ్ బలంగా లేదు.. అందుకే ఇలాంటి పిచ్‌లు తయారు చేస్తున్నారంటూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియాలో 20 వికెట్లు తీయడం అంత సులువు కాదని అన్నాడు.

స్పిన్నర్లనే నమ్ముకున్న ఇండియన్ టీమ్
స్పిన్నర్లనే నమ్ముకున్న ఇండియన్ టీమ్ (AFP)

Gavaskar on Team India: క్రికెట్ లో ఏ సిరీస్ జరిగినా దానికి ముందు నుంచి ఆయా టీమ్స్ బలాబలాలు.. గతంలో రికార్డులు, ఇప్పుడు ఫేవరెట్ గా దిగబోయే జట్టుపై చర్చ జరుగుతుంది. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మాత్రం అందుకు భిన్నమైన చర్చ నడుస్తోంది. మొదటి నుంచీ పిచ్ లపైనే చర్చిస్తున్నారు. సిరీస్ ప్రారంభమై.. తొలి టెస్టు మూడు రోజుల్లోపే ముగియడంతో ఇది మరింత ఎక్కువైంది.

ఇక ఇండోర్ లో టీమిండియా ఇదే స్పిన్ పిచ్ పై బోల్తా పడటం, ఐసీసీ దీనికి చెత్త పిచ్ అనే రేటింగ్ ఇవ్వడంతో పిచ్ లపై చర్చ మరో స్థాయికి చేరింది. తాజాగా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. ఇండియన్ టీమ్ పై మండిపడ్డాడు. టీమ్ బౌలింగ్ అటాక్ చాలా బలహీనంగా ఉందని, అందుకే ఇలా స్పిన్ పిచ్ లు తయారు చేయిస్తున్నారని అతడు అనడం గమనార్హం.

ఇండియా టుడేతో అతడు మాట్లాడాడు. "ఇండియాలో 20 వికెట్లు తీయడం అంత సులువు కాదు. చాలా వరకూ ఇండియన్ పిచ్ లపై స్ట్రైక్ బౌలర్లు బుమ్రా, షమి లేకుండా, అంతగా అనుభవం లేని సిరాజ్ తో బౌలింగ్ అటాక్ బలహీనంగా మారింది. కానీ కాస్త డ్రై పిచ్ సహకారంతో ఇండియా 20 వికెట్లు తీసుకోగలదు. ఇలాంటి పిచ్ లు తయారు చేయడం వెనుక అదే కారణమని నేను భావిస్తున్నాను" అని గవాస్కర్ అన్నాడు.

చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. అతడు మరో ఆరు నెలల జట్టులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించినా బుమ్రా లేకుండానే బరిలోకి దిగాలి. ఇక ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించడానికి కూడా ఇలాంటి పిచ్ లు చేయడం తప్ప మరో మార్గం లేదని కూడా గవాస్కర్ చెప్పాడు.

"డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఇండియా వెళ్లాలంటే వాళ్లకు ఇలాంటి స్పిన్ పిచ్ లు తయారు చేయడం తప్ప మరో మార్గం లేదు. బౌలింగ్ అటాక్ బలంగా ఉంటే మరో దారి ఆలోచించవచ్చు. కానీ మీ ప్రధాన బలం స్పిన్నర్లే. అందుకే ఇలాంటి పిచ్ లు తయారు చేస్తున్నారు. ఫ్లాట్ పిచ్ లు తయారు చేస్తే బ్యాటర్లు డామినేట్ చేస్తారు. కానీ ఈ పిచ్ లు బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నాయి" అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో ఇండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. మార్చి 9 నుంచి చివరి టెస్టు అహ్మదాబాద్ లో జరగనుంది. ఆ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. లేదంటే శ్రీలంక, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం