Gavaskar Fires on Australia Selectors: ఆస్ట్రేలియా సెలక్టర్లపై గవాస్కర్ మండిపాటు.. రాజీనామా చేయాలని స్పష్టం.. ఎందుకంటే?-sunil gavaskar slams australia selectors they should resign for selection call ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar Fires On Australia Selectors: ఆస్ట్రేలియా సెలక్టర్లపై గవాస్కర్ మండిపాటు.. రాజీనామా చేయాలని స్పష్టం.. ఎందుకంటే?

Gavaskar Fires on Australia Selectors: ఆస్ట్రేలియా సెలక్టర్లపై గవాస్కర్ మండిపాటు.. రాజీనామా చేయాలని స్పష్టం.. ఎందుకంటే?

Maragani Govardhan HT Telugu
Mar 06, 2023 07:57 AM IST

Gavaskar Fires on Australia Selectors: టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియా సెలక్టర్లపై మండిపడ్డారు. ఆ జట్టు ఎంపికపై ప్రశ్నలు గుప్పించారు. ముగ్గురు ఆటగాళ్లు రెండు టెస్టులకు అందుబాటులో ఉండనప్పుడు వారిని ఎందుకు ఎంపిక చేశారంటూ ప్రశ్నించారు.

ఆసీస్ సెలక్టర్లపై సునీల్ గవాస్కర్ ప్రశ్నల వర్షం
ఆసీస్ సెలక్టర్లపై సునీల్ గవాస్కర్ ప్రశ్నల వర్షం

Gavaskar Fires on Australia Selectors: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఎక్కువగా చర్చకు దారి తీసిన అంశం పిచ్. భారత పిచ్‌లు పేలవంగా ఉన్నాయంటూ పలువురు మాజీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది ఆసీస్ మాజీ క్రికెటర్లయితే టీమిండియా నాగ్‌పుర్ పిచ్‌ను డాక్టరింగ్(పిచ్ తమకు అనుగుణంగా మార్చడం) చేసిందను ఆరోపించారు. అయితే ఇండోర్ టెస్టు ఫలితం కూడా ఈ చర్చపై మరింత తీవ్రతరమైంది. పిచ్‌లే కాకుండా పలువురు ఆస్ట్రేలియా మాజీలు చాలా విషయాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పించారు. తాజాగా భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన స్పందనను తెలియజేశారు. ఆటగాళ్లపై వేలు చూపించే బదులు.. ఆస్ట్రేలియా సెలక్టర్లను ప్రశ్నించాలని ఆ దేశ మాజీ ఆటగాళ్లకు సూచించారు.

"ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు మీడియా సాక్షిగా తమ జట్టు సెలక్టర్లను వివధ కోణాల్లో ప్రశ్నించాలి. ముగ్గురు ఆటగాళ్లు(హేజిల్‌వుడ్, స్టార్క్, కామెరూన్ గ్రీన్) తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండరని తెలిసినప్పుడు వారిని ఎలా జట్టులోకి ఎంపిక చేశారు? అంటే సగం సిరీస్ వరకు కూడా 12 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేశారు." అని సునీల్ గవాస్కర్ అన్నారు.

స్పిన్నర్ కునేమన్ ఎంపికపై కూడా ఆస్ట్రేలియా సెలక్టర్లను గవాస్కర్ ప్రశ్నించారు. "జట్టులో కొత్తగా వచ్చిన కునేమన్‌ లాంటి ఆటగాడు ఉన్నప్పుడు అతడిని ఎందుకు ఎంచుకున్నారు? ఒకవేళ జట్టులో ఆటగాళ్లు తగినంతగా లేరనుకుంటే ముందు ఎందుకు తీసుకోలేదు? అంటే టీమ్ మేనేజ్మెంట్ 12 మంది ఆటగాళ్లలో 11 మందిని ఎంపిక చేసింది. ఒకవేళ ఆస్ట్రేలియా చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సమం చేసినప్పటికీ సెలక్టర్లకు బాధ్యతాయుత భావం ఉన్నట్లయితే రాజీనామా చేయాలి." అని గవాస్కర్ స్పష్టం చేశారు.

ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో రోజు ఉదయమే మ్యాచ్ ముగిసింది. మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు విపరీతంగా అనుకూలించింది. తొలి రోజు ఆరంభం నుంచే పిచ్‌పై స్పిన్నర్లు విజృంభించారు. ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. మార్చి 9 నుంచి ఆఖరుదైన నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది.

Whats_app_banner