తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Umran Malik Speed: దటీజ్ ఉమ్రాన్.. గంటకు 150 కి.మీ. వేగం.. స్టంప్స్‌పై బెయిల్ సర్కిల్ బయట

Umran Malik Speed: దటీజ్ ఉమ్రాన్.. గంటకు 150 కి.మీ. వేగం.. స్టంప్స్‌పై బెయిల్ సర్కిల్ బయట

Hari Prasad S HT Telugu

02 February 2023, 9:49 IST

google News
    • Umran Malik Speed: దటీజ్ ఉమ్రాన్. అతడు గంటకు 150 కి.మీ. వేగంతో వేసిన ఓ బాల్ స్టంప్స్‌పై ఉన్న బెయిల్ ను ఏకంగా 30 గజాల సర్కిల్ బయటకు విసిరేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
తన స్పీడుతో బ్రేస్‌వెల్ ను బోల్తా కొట్టించిన ఉమ్రాన్ మాలిక్
తన స్పీడుతో బ్రేస్‌వెల్ ను బోల్తా కొట్టించిన ఉమ్రాన్ మాలిక్

తన స్పీడుతో బ్రేస్‌వెల్ ను బోల్తా కొట్టించిన ఉమ్రాన్ మాలిక్

Umran Malik Speed: ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసే వాళ్లలో ఒకడు. కేవలం వేగాన్ని నమ్ముకొని ప్రత్యర్థిని బోల్తా కొట్టించే బౌలర్. ఐపీఎల్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన ఉమ్రాన్.. ఇప్పుడు ఇండియన్ టీమ్ లోనూ అదే వేగంతో రాణిస్తున్నాడు. నిలకడగా గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉన్న ఉమ్రాన్ ను ఎదుర్కోవడానికి ఇప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడగా గంటకు 150 కి.మీ.లకు పైగా వేగంతో బౌలింగ్ చేసిన మరో ఇండియన్ బౌలర్ ఎవరూ లేరు. ఇక తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో ఉమ్రాన్ ఇలాగే వేసిన ఓ బాల్ ఆ టీమ్ బ్యాటర్ మైకేల్ బ్రేస్‌వెల్ ను బోల్తా కొట్టించింది. చాలా వేగంగా వచ్చిన బాల్ ను పుల్ షాట్ తో బౌండరీకి తరలించాలని ప్రయత్నించిన బ్రేస్‌వెల్ బోల్తాపడ్డాడు.

ఆ బాల్ స్పీడ్ అతని బ్యాట్ వేగం కంటే ఎక్కువగా ఉంది. దీంతో అది కాస్తా అదే వేగంతో వెళ్లి స్టంప్స్ కి తగిలింది. దీంతో స్టంప్స్ పై ఉన్న బెయిల్ ఎగిరి ఏకంగా 30 గజాల సర్కిల్ బయట పడటం విశేషం. మొదట్లో దీనిని ఎవరూ గమనించకపోయినా.. తర్వాత రీప్లేల్లో ఇది స్పష్టంగా కనిపించింది. బాల్ స్టంప్స్ ని తగిలి వికెట్ కీపర్ చేతుల్లో పడగా.. బెయిల్ మాత్రం అతని తల మీదుగా వెళ్లి వెనుక సర్కిల్ బయట పడింది.

దీనిని బట్టి ఉమ్రాన్ ఎంత వేగంతో ఆ బాల్ వేశాడో అర్థం చేసుకోవచ్చు. మూడో టీ20లో గంటకు 148.6 కి.మీ. వేగంతో ఉమ్రాన్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. రెండు బాల్స్ వేసిన తర్వాత గంటకు 150 కి.మీ. వేగంతో వేసిన బాల్ ను పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించిన బ్రేస్‌వెల్.. కనీసం బాల్ ను టచ్ చేయలేకపోయాడు. అదికాస్త వెనుక వికెట్లకు గిరాటేసింది.

ఈ మ్యాచ్ లో చివరి వికెట్ అయిన డారిల్ మిచెల్ ను కూడా ఉమ్రానే తీసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 9 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 16 పరుగులకు 4 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ కేవలం 66 పరుగులకే కుప్పకూలింది. 168 రన్స్ తో గెలిచిన ఇండియా.. తన టీ20 క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. సిరీస్ ను కూడా 2-1తో ఎగరేసుకుపోయింది.

తదుపరి వ్యాసం