Aaqib Javed on Umran Malik: ఉమ్రాన్‌కు అంత ఫిట్‌నెస్ లేదు.. మా హరీస్‌లాగా బౌలింగ్ చేయలేడు: పాక్ మాజీ బౌలర్
23 January 2023, 12:58 IST
- Aaqib Javed on Umran Malik: ఉమ్రాన్‌కు అంత ఫిట్‌నెస్ లేదని, తమ హరీస్ రవూఫ్ లాగా అతడు బౌలింగ్ చేయలేడని అన్నాడు పాకిస్థాన్ మాజీ బౌలర్ ఆఖిబ్ జావెద్. ఇది కోహ్లిని ఇతర బ్యాటర్లతో పోల్చినట్లుగా ఉంటుందని అతడు అనడం విశేషం.
ఉమ్రాన్ మాలిక్, హరీస్ రవూఫ్
Aaqib Javed on Umran Malik: టీమిండియా పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ పై ఇప్పటికే ఎందరో మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. గంటకు నిలకడగా 150 కి.మీ. వేగం అందుకుంటున్న ఉమ్రాన్ ను పాకిస్థాన్ మాజీ బౌలర్లు కూడా ఆకాశానికెత్తారు. ఆ టీమ్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ వేసిన అత్యంత వేగవంతమైన డెలివరీ రికార్డును కూడా ఉమ్రాన్ అందుకుంటాడన్న అంచనా ఉంది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కే చెందిన మాజీ పేస్ బౌలర్ ఆఖిబ్ జావెద్ మాత్రం పూర్తిగా విరుద్ధమైన ప్రకటన జారీ చేశాడు. ఉమ్రాన్ ను తరచూ పాకిస్థాన్ బౌలర్ హరీస్ రవూఫ్ తో పోల్చడంపై ఆఖిబ్ స్పందించాడు. అసలు రవూఫ్ తో పోలిస్తే ఉమ్రాన్ ఏమాత్రం ఫిట్ గా లేడని ఆఖిబ్ అనడం గమనార్హం. తొలి ఓవర్ నుంచి చివరి వరకూ ఒకే స్పీడు బౌలింగ్ చేసే సత్తా ఉమ్రాన్ కు లేదని అభిప్రాయపడ్డాడు.
అంతేకాదు ఈ సందర్భంగా విరాట్ కోహ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ఉమ్రాన్ ను రవూఫ్ తో పోల్చడం విరాట్ కోహ్లిని ఇతర బ్యాటర్లతో పోల్చడం లాంటిదే అని అనడం విశేషం. ఉమ్రాన్ మాలిక్ ఇప్పటి వరకూ అత్యధికంగా గంటకు 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. ఇది ఐపీఎల్లో కాగా.. అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం 156 కి.మీ. అతని అత్యుత్తమం. అందే హరీస్ రవూఫ్ మాత్రం గంటకు 159 కి.మీ. వేగంతోనూ వేశాడు.
ఇదే విషయాన్ని ఆఖిబ్ ప్రస్తావిస్తూ.. ఉమ్రాన్ కు ఫిట్‌నెస్ లేదని అన్నాడు. "ఉమ్రాన్ మాలిక్.. హరీస్ రవూఫ్ అంత ఫిట్ గా లేడు. అతని అంత శిక్షణ కూడా తీసుకోలేదు. వన్డేల్లో చూస్తే తొలి స్పెల్ లో గంటకు 150 కి.మీ. వేగంతో వేస్తాడు. అదే 7 లేదా 8వ ఓవర్లో అది 138 కి.మీ.లకు పడిపోతుంది. కోహ్లికి, ఇతర బ్యాటర్లకు ఉన్న వ్యత్యాసమే వీళ్లిద్దరి మధ్య కూడా ఉంది. హరీస్ చాలా క్రమశిక్షణగా ఉంటాడు.
అతని ఆహారం, శిక్షణ, లైఫ్ స్టైల్ అంతా క్రమశిక్షణతో సాగుతుంది. హరీస్ లాగా డైట్ ను కచ్చితంగా ఫాలో అయ్యే ఒక్క పాక్ బౌలర్ కూడా లేడు. అతనిలా లైఫ్ స్టైల్ కూడా ఎవరిదీ లేదు. గంటకు 160 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసినా నేను పట్టించుకోను. కానీ నిలకడగా ఒకే వేగంతో మ్యాచ్ అంతా బౌలింగ్ చేయడం కీలకం" అని ఆఖిబ్ అన్నాడు.
రెండేళ్ల కింద ఐపీఎల్లో తన వేగంతో అందరికీ ఆకట్టుకున్న ఉమ్రాన్.. గతేడాది సన్ రైజర్స్ టీమ్ తరఫున మరోసారి మెరిశాడు. దీంతో ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి ఎంపికయ్యాడు. గత రెండు నెలల కాలంలో నిలకడగా రాణిస్తూ ఎంతో మెరుగయ్యాడు.