Kaneria on Team India: వరల్డ్‌కప్‌కు ఎలా సిద్దం కావాలో ఇండియాను చూసి నేర్చుకోండి.. పాకిస్థాన్‌కు మాజీ క్రికెటర్ చురక
Kaneria on Team India: వరల్డ్‌కప్‌కు ఎలా సిద్దం కావాలో ఇండియాను చూసి నేర్చుకోండి అంటూ పాకిస్థాన్‌కు మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చురక అంటించాడు. ఒకే ప్లేయర్ పై అభిమానం చూపిస్తూ అతన్నే కొనసాగించడం సరి కాదని అన్నాడు.
Kaneria on Team India: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పై తీవ్రంగా మండిపడ్డాడు ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. వన్డే వరల్డ్ కప్ కు సిద్ధమయ్యే తీరు ఇది కాదని అతడు విమర్శించాడు. ఈ విషయంలో ఇండియాను చూసి నేర్చుకోవాలని సూచించాడు. వరల్డ్ కప్ ఏడాదిని ఇండియా ఘనంగా మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
శ్రీలంక, న్యూజిలాండ్ లపై వరుసగా రెండు సిరీస్ లను గెలిచింది. ఇప్పుడు న్యూజిలాండ్ ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఈ ఏడాదిని దారుణంగా ప్రారంభించింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ ను కోల్పోయింది. ఇదే విషయాన్ని లేవనెత్తుతూ.. పాకిస్థాన్ తమ తుది జట్టులో ఆడిస్తున్న ప్లేయర్స్ గురించి కనేరియా ప్రస్తావించాడు.
ఒకే ప్లేయర్ పై అభిమానం చూపిస్తూ అతన్నే కొనసాగించడం సరి కాదని అన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ తో కనేరియా మాట్లాడాడు. ఇషాన్ కిషన్ లాంటి యువ వికెట్ కీపర్ కు ఇండియా ఎలా అవకాశాలు ఇస్తోందో చూసి నేర్చుకోవాలని పాకిస్థాన్ టీమ్ కు సూచించాడు. కానీ పాకిస్థాన్ మాత్రం యువ వికెట్ కీపర్ మహ్మద్ హారిస్ ను పక్కన పెట్టి రిజ్వాన్ కే అవకాశాలు ఇస్తోందని అన్నాడు.
"వరల్డ్ కప్ కు రిషబ్ పంత్ అందుబాటులో ఉండే అవకాశం లేదని ఇండియాకు తెలుసు. దీంతో కేఎల్ రాహుల్ కు బ్యాకప్ గా ఇషన్ కిషన్ ను ప్రోత్సహిస్తోంది. కానీ మనం ఏం చేస్తున్నాం? కేవలం రిజ్వాన్ నే కొనసాగిస్తూ మహ్మద్ హారిస్ ను పట్టించుకోవడం లేదు. వరల్డ్ కప్ కు టీమ్ ను సిద్ధం చేయడంలో ఇలా ఒక ప్లేయర్ పై అభిమానం మేలు చేయదు" అని కనేరియా అన్నాడు.
ఇక స్వదేశంలో పూర్తిగా నిర్జీవమైన పిచ్ లను రూపొందిస్తున్న పీసీబీపై కూడా కనేరియా మండిపడ్డాడు. "ఫలితంతో సంబంధం లేకుండా సజీవమైన పిచ్ లను తయారు చేస్తే ప్రత్యర్థి కూడా పేస్, బౌన్స్ ను ఎంజాయ్ చేస్తారు. అదే సమయంలో స్టేడియాలు కూడా నిండుతాయి.
కానీ పాకిస్థాన్ లో నేషనల్ స్టేడియం ఒక్క రోజు కూడా నిండలేదు. నిర్జీవమైన పిచ్ లను తయారు చేసిన క్యూరేటర్లు, పీసీబీదే ఈ తప్పు. పాకిస్థాన్ బౌలర్ల తప్పు లేదు. అభిమానులు స్టేడియాలకు రావాలని అనుకుంటారు కానీ ఎలాంటి వినోదం లేకపోతే ఎలా" అని కనేరియా అన్నాడు.
సంబంధిత కథనం