Rohit Sharma to Ishan: డబుల్ సెంచరీ కొట్టినా మూడు మ్యాచ్‌లు ఎందుకు ఆడలేదన్న రోహిత్.. ఇషాన్ సమాధానమిదీ
Rohit Sharma to Ishan: డబుల్ సెంచరీ కొట్టినా మూడు మ్యాచ్‌లు ఎందుకు ఆడలేదని ఇషాన్ కిషన్ ను అడిగాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దానికి ఇషాన్ ఇచ్చిన సమాధానంతో రోహిత్ నవ్వు ఆపుకోలేకపోయాడు.
Rohit Sharma to Ishan: వన్డేల్లో డబుల్ సెంచరీ క్లబ్ లో మరో ఇండియన్ ప్లేయర్ చేరాడు. హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ ప్లేయర్ కాగా.. అత్యంత పిన్న వయసులో డబుల్ బాదిన ప్లేయర్ గా గిల్ రికార్డు క్రియేట్ చేశాడు.
అయితే ఈ మ్యాచ్ తర్వాత ప్రస్తుతం ఇండియన్ టీమ్ లో ఉన్న ముగ్గురు డబుల్ సెంచూరియన్లు ఒక్క చోట చేరారు. ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ సరదాగా గడిపారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. ఇషాన్ గతేడాది డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
అతడు 126 బంతుల్లోనే ఈ ఘనత అందుకొని అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ముందుగా ఈ ఇద్దరూ డబుల్ సెంచరీ క్లబ్ లోకి గిల్ ను ఆహ్వానించారు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్.. ఇషాన్ తో మాట్లాడుతూ.. నువ్వు డబుల్ సెంచరీ చేసిన తర్వాతి మూడు మ్యాచ్ లు ఎందుకు ఆడలేదు అని ప్రశ్నించాడు.
దీనికి ఇషాన్ స్పందిస్తూ.. "భయ్యా ఇది మీరే చెప్పాలి. కెప్టెన్ మీరే కదా" అని అన్నాడు. దీంతో రోహిత్ పడీపడీ నవ్వాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ లో ఇషాన్ కు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు రాహుల్ ఈ సిరీస్ కు అందుబాటులో లేకపోవడంతో తొలి వన్డేలో ఇషాన్ ఆడాడు. ఓపెనర్ గానే కాదు.. నాలుగో స్థానంలో ఆడటానికి కూడా తాను సిద్ధమే అని ఈ సందర్భంగా రోహిత్ కు ఇషాన్ చెప్పాడు.
ఇక గిల్ విషయానికి వస్తే డబుల్ సెంచరీ క్లబ్ లో చేరడం అద్బుతంగా ఉందని అన్నాడు. శ్రీలంక సిరీస్ లో అవకాశం ఉన్నా.. డబుల్ సెంచరీగా మలచలేకపోయానని, ఈసారి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లు చెప్పాడు. అదే సమయంలో ప్రతి మ్యాచ్ కు ముందు ఏం చేస్తావ్ అంటూ గిల్ ను సరదాగా ప్రశ్నించాడు ఇషాన్.
"మ్యాచ్ కు ముందు ఇషాన్ నా రొటీన్ ప్లాన్ ను పాడు చేస్తాడు. అసలు పడుకోనివ్వడు. ఎయిర్ పాడ్స్ పెట్టుకోకుండా పెద్దగా సౌండ్ పెట్టి రాత్రంతా సినిమాలు చూస్తాడు. మేమిద్దరూ రోజూ పోట్లాడుకుంటాం. ఇది తన రూమ్ అని, తాను చెప్పినట్లే అందరూ నడుచుకోవాలని ఇషాన్ అంటాడు" అని రోహిత్ కు సరదాగా ఫిర్యాదు చేశాడు శుభ్‌మన్ గిల్.
సంబంధిత కథనం